– మునుకుంట్ల ప్రాథమిక పాఠశాలలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు
కట్టంగూర్, మార్చి 30 : కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అభ్యున్నతికి గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకు వచ్చింది. సోమవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, భాషా నైపుణ్యాల అభివృద్ధి, ఏఐ ఆధారిత విద్య కోసం కంప్యూటర్ను బహుకరించారు. అదేవిధంగా, హై స్కూల్ విద్యార్థుల కోసం కంప్యూటర్, ప్రింటర్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ మేనేజర్ ఊట్కూరి జనార్థన్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, చదువుపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసిస్తూ నిజాయితీ, క్రమశిక్షణ వంటి లక్షణాలను అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ అప్పలకొండ, ఇంజినీర్ సాయి కుమార్, గ్రామ సర్పంచ్ గుల్లి నరేశ్, ఉప సర్పంచ్ మల్లేశ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, హైస్కూల్ హెచ్ఎం షమీమా బేగం, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, మాజీ సర్పంచ్ గడుసు అనిత సుధీర్ రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

విద్యార్థుల అభ్యున్నతికి గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సేవలు