Gade Innaiah | సామాజిక ఉద్యమకారుడు, మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్య ఇంట్లో విషాదం నెలకొంది. ఇన్నయ్య తల్లి థెరిసమ్మ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలు, వయోభారంతో ఇబ్బంది పడుతున్న ఆమె గురువారం రాత్రి జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సాగరంలోని సొంతింట్లో తుదిశ్వాస విడిచారు. శనివారం నాడు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.
మావోయిస్టు పార్టీకి అనుకూలంగా మాట్లాడినందుకు మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు డిసెంబర్లో అరెస్ట్ చేశారు. ఇన్నయ్య జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రేగడి తండా గ్రామ పంచాయతీ పరిధిలో ‘మా ఇల్లు ప్రజాదరణ’ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు .. ఆశ్రమానికి చేరుకుని మూడు గంటలపాటు విచారణ చేపట్టారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇన్నయ్య హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఉన్నారు.