హిమాయత్‌నగర్,ఏప్రిల్29 : ఉస్మానియా పీ.జీ విద్యార్థి డాక్టర్ కట్రావత్ సురేష్ నాయక్ ఆత్మహత్య ఘటనపై సమగ్రమైన విచారణ జరిపించాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మృతుడు సురేష్ తల్లి నాగమణి, బావ యు.రవితో కలిసి వారు మాట్లాడారు. ఉస్మానియా జనరల్ దవాఖానలో జనరల్ సర్జరీ విభాగంలో మృతుడు సురేష్ నాయక్ పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు.
ఇటీవల తాము ఉస్మానియా మెడికల్ కాలేజీని సందర్శించి సురేష్ ఆత్మహత్య ఘటనపై నిజా నిర్ధారణ చేపట్టడం జరిగిందని తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న సురేష్ సీనియర్ల వేధింపుల వల్ల మానసికంగా తీవ్ర ఆవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. విద్యార్థులకు ఆమోదయోగ్యంగా లేని ఎన్ఎంసీ నిబంధనలను మార్చాలన్నారు. మృతుడు సురేష్ నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.