Karnataka | బెంగళూరు, ఏప్రిల్ 7 : బెంగళూరు లాంటి మహా నగరాల్లో మహిళలపై లైంగిక దాడులు సర్వసాధారణమేనని కర్ణాటక కాంగ్రెస్ మంత్రి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బెంగళూరులో ఓ యువతిపై దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట ప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్రోలింగ్ పెంచాలని పోలీసులను ఆదేశించారు. అయితే హోం మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షంతో పాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. సుద్దగుంటపాళ్యలోని భారతీ లేఅవుట్లోని ఓ ఇరుకు సందులో ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ గత వారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏప్రిల్ 3న తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. జన సంచారం లేని వీధిలో నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు మహిళల వద్దకు వచ్చిన దుండుగుడు ఓ మహిళను గోడకు తోసి ఆమె శరీరాన్ని అసభ్యకరంగా తాకిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. ఆ తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో ఆ ఇద్దరు మహిళలు నిశ్చేష్టులు కావడం అందులో కనిపించింది. ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ సుమోటోగా కేసును నమోదు చేసిన బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు లాంటి మహా నగరంలో లైంగిక దాడులు జరగడం సహజమేనంటూ వ్యాఖ్యానించిన కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఆదేశించాలని బీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. పరమేశ్వర వరుస తప్పులకు పాల్పడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. 2017లో కర్ణాటకలో మహిళలపై దాడుల సందర్భంగా వారిని కించపరిచే విధంగా పరమేశ్వర వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. యావత్ దేశాన్ని ముఖ్యంగా కర్ణాటకలోని మహిళలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై రాష్ట్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన నీచ మనస్తత్వానికి అద్దం పడుతుందని పూనావాలా ఆరోపించారు. నిందితులకు అండగా హోం మంత్రే నిలబడితే కర్ణాటక పోలీసులు ఎలా పనిచేయగలరని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో మహిళలపై నేరాలు 50 శాతం పెరిగాయని ఆయన చెప్పారు. మహా భారతంలో ద్రౌపదికి జరిగిన పరాభవాన్ని కూడా పరమేశ్వర చాలా చిన్న సంఘటనగా కొట్టివేయగలరని, ఆ సంఘటనే పాండవులు, కౌరవులకు మధ్య మహా సంగ్రామానికి దారితీసిందన్న విషయం అందరికీ తెలిసిందేనని బీజేపీ నేత వ్యాఖ్యానించారు. పరమేశ్వర వ్యాఖ్యలు సిగ్గుచేటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.