విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘ధమ్కీ’. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్ పతాకంపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు అనిల్ రావిపూడి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..‘కృష్ణదాస్ అనే వెయిటర్ జీవితంలో జరిగే కథ ఇది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు వినోదాత్మకంగా సాగుతుంది. కథ వింటున్నప్పుడే చాలా నవ్వుకున్నాం. సినిమా చూశాక మీరూ అలాగే నవ్వుతారని ఆశిస్తున్నాను. ఈనెల 14నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మూడు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నాం’ అన్నారు. “పాగల్’ తర్వాత విశ్వక్ సేన్‌తో మళ్లీ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న కథ ఇది’ అన్నారు దర్శకుడు నరేష్ కుప్పిలి. ఈ చిత్రానికి సంగీతం : లియోన్ జేమ్స్, సినిమాటోగ్రఫీ : దినేష్ కె బాబు, ఆర్ట్ : కె రామాంజనేయులు.