కొన్ని ఫలాలకు ప్రాణవాయువు స్థాయిని పెంచే శక్తి ఉంది. వాటిలోని విటమిన్స్, మినరల్స్, ఆల్కలిన్స్ మొదలైనవి రక్త ప్రసరణను, దాంతోపాటు ఆక్సిజన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి. ఈ ఆల్కలిన్ ఆహార పదార్థాలు గుండెపోటును, అధిక రక్తపోటును నివారిస్తాయి. అంతేకాదు, విటమిన్-డిని చైతన్యపరుస్తాయి.
అవకాడో
ఇందులో విటమిన్-ఎ, బి3, బి6, బి12, కోలిన్, ఫొలేట్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థాలు పుష్కలం. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరిగేందుకు దోహదపడతాయి. అలాగే కొవ్వును కరిగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరుస్తాయి. డీఎన్ఏని కాపాడతాయి. కంటి ఆరోగ్యానికి మేలుచేస్తాయి. రోజుకు సగం అవకాడో అయినా తీసుకోవాలి.
దానిమ్మ
ఐరన్, కాపర్, జింక్, విటమిన్- బి3, బి6, కోలిన్ ఉంటాయి. ఇవి నత్రికామ్లాన్ని పెంచి రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి. ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. దానిమ్మ గింజలు లేదా రసం తాగితే, ఆక్సిజన్ స్థాయి పడిపోవడంవల్ల కలిగే కణజాల నష్టాన్ని అరికట్టవచ్చు. రోజుకు కనీసం 375 మిల్లీలీటర్ల దానిమ్మ రసం తాగాలి.
కివీ
ఈ పండ్లు పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉంటాయి. ఇందులో ఫైబర్, కాపర్, ఐరన్, విటమిన్-ఎ, బి3, బి5, బి6, సి, కోలిన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. డీఎన్ఏను కాపాడటంతో పాటు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తాయి. రోజుకో కివీ పండు తినాలి.
ఖర్బూజా
విటమిన్-ఎ, బి3, బి5, బి6, సి, కోలిన్, ఫొలేట్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలం. చక్కెర తక్కువగా ఉండటంవల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినొచ్చు. సీజన్ ఉన్నప్పుడు రోజుకొక కప్పు స్మూతీ తీసుకోవచ్చు.
అనాస
ఈ పండులో విటమిన్-ఎ, బి3, బి5, బి6, సి, కాపర్, ఐరన్, పొటాషియం, జింక్, కోలిన్, ఫొలేట్, బీటా కెరోటీన్ ఉంటాయి. రక్త కణాల గోడల నుంచి ఆక్సిజన్, పోషకాలు సులువుగా ప్రవేశించేందుకు అనాస దోహదపడుతుంది. ముఖ్యంగా ఇందులోని బ్రొమ్లైన్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా అరికడుతుంది. వారంలో మూడుసార్లయినా ఒక కప్పు అనాస పండు ముక్కలు తినాలి.
అంజీర-ఖర్జూరం
ఎండిన అంజీర, ఖర్జూరాల్లో ఐరన్, కాపర్, పొటాషియం, విటమిన్-ఎ, బి3, బి5, ఫొలేట్ అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ న్యూరో డీజెనరేషన్‌ను అరికడుతుంది. రోజుకు రెండు ఖర్జూరాలు, రెండు అంజీర పండ్లతో చేసిన స్మూతీ తీసుకోవాలి.
బెర్రీలు
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ పండ్లలో విటమిన్-ఎ, బి3, బి5, బి6, సి, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్, కోలిన్, ఫొలేట్, యాంటీ ఆక్సిడెంట్లు అపారం. ఇవి ఇన్ఫ్లమేషన్,
లిపో ప్రొటీన్- కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. నిత్య ఆహారంలో కొన్ని బెర్రీ పండ్లను చేర్చుకోవాలి.
సిట్రస్ పండ్లు
విటమిన్-సి అధికంగా ఉండే సిట్రస్ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి రక్త ప్రసరణకు ఎంతగానో తోడ్పడతాయి. అలాగే ఆల్కలాయిడ్స్, కోమరిన్స్, ఫినాల్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, లిమోనాయిడ్స్, కెరోటినాయిడ్స్ మొదలైనవి సిట్రస్ పండ్లలో ఉంటాయి. ఇవి గుండె, నరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిమ్మ, నారింజ, బత్తాయి మొదలైనవి సిట్రస్ రకాలు.
-మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri@trudiet.in