ఒకప్పుడు నాగరికతకు నదులు మూలాధారాలు. ఆధునిక కాలంలో ఆ పాత్రను రహదారులు తీసుకున్నాయి. ఈ యుగంలో రోడ్డు ఉంటేనే నాగరికత. సమాజ అభివృద్ధికి మూల కేంద్రం రోడ్డే. పెద్ద రోడ్లు గొప్ప సమాజ ప్రగతికి సంకేతంలా మారాయి. రోడ్ల మెయింటెనెన్స్ పరిపాలనకు ఒక తార్కాణంగా నిలుస్తున్నది. ఒక ప్రభుత్వ పనితీరును కొలిచే ప్రమాణాల్లో ప్రధానమైనది రహదారుల స్థితిగతులు. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని ఒక ఉద్యమం లాగా స్వీకరించింది. గ్రామీణ ప్రాంతాలకు, మండల కేంద్రాలకు, అక్కడ నుంచి జిల్లాల కేంద్రాలకు, అక్కడి నుంచి హైదరాబాద్కు కనెక్టివిటీని పెంచటంపై ప్రధానంగా దృష్టి పెట్టి వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రజలు గానీ, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారు గానీ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను చూసి ముచ్చటపడి, మా దగ్గర జిల్లా కేంద్రాల్లో కూడా ఇంత మంచి రోడ్లు లేవని అబ్బురపడ్డ సందర్భాలున్నాయి. అటువంటి అద్భుతమైన రహదారి నెట్వర్క్ని ఏర్పాటు చేసిన తెలంగాణలో ఇవాళ రోడ్ల మరమ్మతుల కోసమని, వంతెనల కోసమని ప్రజలు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి. రోడ్ల మీద గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
చేవెళ్లలో జరిగిన ఘోరమైన బస్సు దుర్ఘటనే ఇందుకు తార్కాణం. 20 మంది ప్రాణాలు బలిగొన్న ఈ దుర్ఘటనతో అందరి దృష్టి రోడ్ల స్థితిగతులపైకి మళ్లింది. ఏండ్ల తరబడి ఉన్న గుంతల్ని ఎన్నిసార్లు కోరినా పూడ్చకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమిక నిర్ధారణ. రోడ్లు బాగుపడితే ప్రమాదాలు పెరుగుతాయని, అస్తవ్యస్తంగా ఉంటేనే వాహనదారులు వేగం తగ్గిస్తారనీ, తద్వారా దుర్ఘటనలు తక్కువగా చోటుచేసుకుంటాయనేది చేవెళ్ల బీజేపీ ఎంపీ ఉవాచ. ఇక చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు చనిపోతూనే ఉంటారని, పైగా దుర్ఘటనలో చనిపోయినవాళ్లు తన నియోజకవర్గం ప్రజలు కారు కనుక తానెందుకు మాట్లాడాలనడం మరో వైపరీత్యం. రెండు జాతీయపార్టీల ఆలోచన ధోరణికి ఈ ఇద్దరి మాటలు అద్దం పడుతున్నాయి!
రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో తెలంగాణలో రోడ్ల పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారవుతున్నది. ఇటీవలి కాలంలో వర్షాలకు హైదరాబాద్ రోడ్లపై గుంతల్లో పడి దెబ్బతిన్న వాహనదారులు కాళ్లు, చేతులు విరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒక అంచనా ప్రకారం రోజుకు 70 ప్రమాదాలు జరిగితే అందులో 20 మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రోడ్ల దుస్థితిపై ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి రావడం గమనార్హం. మొన్న జనగామలో, నిన్న తాండూరులో వంతెనలు, రోడ్ల బాగు కోసం ప్రజలు ఏకంగా ధర్నాలు నిర్వహించారు. గుంతలమయంగా ఉన్న రోడ్లలో వర్షాలు పడి, నీరు చేరినా, ఆ బురదలోనే కూర్చొని నిరసన తెలియజేయడాన్ని మనం చూస్తున్నాం. జనగామ జిల్లాలోనూ ఆర్ అండ్ బీ రహదారులపై వంతెనలు నిర్మించాలని నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది ఈ కాంగ్రెస్ సర్కారు. గత వర్షాకాలంలో వానలు, వరదల వల్ల ఆర్ అండ్ బీ రోడ్లు 739 చోట్ల పాడైపోయి, రూ.980 కోట్ల పైచిలుకు నష్టం వాటిల్లినట్టు గత సెప్టెంబర్లో అధికారులు అంచనా వేశారు. వాటికి నిధులు విడుదల మాటేమోగానీ తాత్కాలిక మరమ్మతులకూ పైసలు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పాలన ఇక చాలని జనం నినదిస్తున్నారు.