కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కార్యనిర్వాహక విభాగం పేరు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ). శతాబ్దంన్నర వయసున్న ఆ పార్టీ ఇప్పుడు భావదారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నది. పూటకో మాట; ప్రాంతానికో ఆట; అగమ్యగోచర బాటతో దేశ ప్రజల విశ్వాసం ఎప్పుడో కోల్పోయింది. రెండు రాష్ర్టాలకే పరిమితమై అది కూడా ప్రజలను మోసం చేసి, మభ్యపెట్టి ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. దరిమిలా దాని విలువలు కూడా పతనమైనయి. సర్వభ్రష్టతకు గురైన ఆ పార్టీ వ్యవహారం అచ్చు సర్కస్‌ను తలపిస్తున్నది. కనుకనే ఏఐసీసీని ఆల్ ఇండియా సర్కస్ కంపెనీ (అఖిల భారత సర్కస్ కంపెనీ) అనవలసి వస్తున్నది.
1969లో ‘గరీబీ హటావో’ నినాదం ఇచ్చిన్రు ఇందిరా గాంధీ. ఆమె నాయకత్వ పటిమ, బ్యాంకుల జాతీయీకరణ తదితర అంశాలను ఏ మాత్రం తక్కువ చేయడం లేదు గానీ, గరీబీ హటావో కోసం ఆ పార్టీ నిజాయితీగా కృషిచేసింది లేదు. చేసి ఉంటే, నాలుగు దశాబ్దాల తర్వాత ఆమె కోడలు‘ఆహార భద్రతా చట్టం’ తెచ్చి ఉండాల్సిన అవసరమొచ్చేది కాదు!
కాంగ్రెస్ పార్టీ మరొక ‘విధాన రాహిత్య’ ఉదాహరణ చూద్దాం! వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిద్దామని ‘స్వామినాథన్ కమిషన్’ ఏర్పాటు చేసింది 2004, నవంబర్ 18న నాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం. వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత, రైతుల సంక్షేమం, రైతుల ఆత్మహత్యల వంటి అనేక అంశాలపై సిఫారసులు చేసింది కమిషన్. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలని సిఫారసు చేసింది కూడా. స్వామినాథన్‌కు తామే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, ఆయన సభలో ఉండగానే ప్రతిపాదించిన కనీస మద్దతు ధర ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది యూపీఏ ప్రభుత్వం. దేశ సుభిక్షత కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు, విధానాల రూపకల్పనలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి తార్కాణం ఇది.
మరో విషయం: మత రాజకీయాలకు తాము వ్యతిరేకమనీ, తమంత సెక్యులర్ లేరని జబ్బలు చరచుకునే కాంగ్రెస్ హయాంలోనే అయోధ్యలో రామ జన్మభూమి నిర్మాణానికి శిలాన్యాస్ జరిగింది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా శిలాన్యాస్ చేస్తే, పీవీ హయాంలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది.
దేశాన్ని కుదిపేసే తీవ్ర అంశాలపైన సీరియస్‌నెస్ లేకపోవడం ఒక పక్క; అట్టడుగు స్థాయి నుంచీ అత్యున్నత స్థాయి వరకూ ఆ పార్టీలో, వాళ్ల ప్రభుత్వాలలో వేళ్లూనుకున్న అవినీతి మరోపక్క! పంటలను నాశనం చేసే పార్థీనియం ‘కలుపు మొక్క’ను ‘కాంగ్రెస్ గడ్డి’ అని పిలుస్తారు కదా. అట్లా ఈ దేశాన్ని వ్యవస్థీకృత అవినీతితో నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ.
రాహుల్ గాంధీ హయాం అయితే మరీ అధ్వాన్నం. మన దేశాన్ని నాలుగు వందల ఏండ్లు పాలించి, దివాలా తీయించింది బ్రిటిష్ వలస పాలన. ముగ్గురు ప్రధానుల వారసుడైన రాహుల్ బాబా లండన్ పోయి, అదే బ్రిటష్ పార్లమెంట్లో మన దేశం గురించి అవమానకరంగా మాట్లాడుతరు! ఎన్నికల వేళల్లో తామూ హిందువులమేనని పైపై పూతలు పూసుకొని నానా ప్రయాసలు పడుతరు. ఆస్తికులైనా, నాస్తికులైనా ప్రజలు పట్టించుకోరు, తమ సమస్యలు తీర్చటం పట్ల, తమ జీవన ప్రమాణాలు మెరుగుపరచడం పట్ల ఎంత స్థిరచిత్తంతో ఉన్నారు పాలకులు అనేదే ముఖ్యం ప్రజలకు. దురదృష్టవశాత్తూ ఈ దూరదృష్టి లోపించిన జాతీయ పార్టీ జనానికి చేదు పాలనే చూపిస్తున్నది, నిరంతరంగా.
ఈ పూట గడిస్తే చాలన్న కురచబుద్ధి తప్ప మరోటి లేదు కాంగ్రెస్ పార్టీకి. క్రికెట్ పిచ్చి ఉన్న దేశ యువత అంతా ఊగిపోయి ఓట్లేస్తరనుకొని సచిన్ టెండూల్కర్‌కు పార్లమెంట్ ఎన్నికల ముందు రాజ్యసభ పదవి ఇచ్చింది కాంగ్రెస్. అదే చేత్తో రేఖకు కూడా ఇచ్చింది. తర్వాతి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. ఆ ఇద్దరూ పార్లమెంటుకు సక్కగ పోయింది కూడా లేదు. ఇప్పుడు అజారుద్దీన్‌ను చూసి జూబ్లీహిల్స్, బీహార్‌లో ఓట్ల వర్షం కురుస్తదనుకుంటే, వాళ్ళ ఖర్మ! చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలె. తూతూ మంత్రం పనులకు తుపుక్కున ఉమ్మేస్తరు జనం. అజార్‌కు హడావుడిగా మంత్రి పదవి ఇచ్చిన్రు. ఈ ఆర్భాటాలు, అడ్‌హక్ పనులు జనాలను రంజింపజేస్తయనుకునే చావు తెలివి కాంగ్రెస్‌ది.
ఎప్పటినుంచో కాంగ్రెస్ అభిమాని, ముఖ్యంగా ఇందిరమ్మ అంటే ప్రాణం పెట్టే ఒక మిత్రుడు అన్నాడు మొన్న అక్టోబర్ 31న… ‘దివంగత నాయకురాలి వర్ధంతికి మనసారా ఒక ఫేస్బుక్ పోస్ట్ కూడా పెట్టలేకపోతున్న. బట్టలూడదీసి కొడితే తప్ప ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం అర్థం కాదు’ అని సీఎం పబ్లిక్‌గా అన్న తర్వాత; గాంధీ వారసులు ఎవరూ దానిని తప్పు పట్టకపోగా, రాష్ర్టాన్ని రేవంత్‌కు ఇష్టారాజ్యంగా వదిలేసిన్రు. రాహుల్ గాంధీకి స్ఫూర్తి ఇవ్వలేని నాయనమ్మ నాకెట్లా ఇవ్వగలరు?అన్నడు విషాదం మొహమంతా నింపుకొని! ఇది ఆ పార్టీకి గౌరవమా? దేశమంతా తుడిచిపెట్టుకుపోతున్న వేళ, తెలివి తెచ్చుకోవడం మానేసి, ఇంకా ఇంకా పాతాళంలోకి కూరుకుపోవడం, తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలు ఆ పతనంలో భాగస్వాములు కావడం ప్రజాస్వామ్య ప్రియులకు ఆమోదమా?
ఢిల్లీలో రాహుల్ చుట్టూ, తెలంగాణలో రేవంత్ చుట్టూ తిరుగుతున్న మేధో ఉపగ్రహాలు చేస్తున్న హాని అంతా ఇంతా కాదు. దేశమంతా రాజ్యాంగం పట్టుకు తిరుగుతూ హక్కుల గురించి లెక్చర్లు దంచే రాహుల్‌గాంధీకి బస్తీ పేదల జీవితాల్ని చిదిమేస్తున్న రేవంత్ బుల్డోజర్ కనబడదు! హైదరాబాద్‌ను హైడ్రాబ్యాడ్గా నిలబెట్టిందీ పట్టదు! బీహార్ చెరువులో ఈత కొడుతూ చేపలు పట్టే యువరాజుకు కులవృత్తులను అవమానించే రేవంత్ అసభ్య పదజాలం, ప్రతీకలూ వినబడవు. అదే బీహార్ గురించి తమ తెలంగాణ నాయకుడి వాచాలత పట్ల ఎపుడైనా క్లాస్ పీకినట్టు మనకైతే తెలియదు. తాను చాయ్ తాగిన చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులకు; తాను ఎక్కితిరిగిన, ఇపుడు కిరాయి డ్రైవర్‌గా మారిన అప్పటి ఆటో ఓనర్ మస్రత్ అలీకి ఒకసారి కనపడగలరా రాహుల్? పది మంది ఎమ్మెల్యేల చోరీ, జూబ్లీహిల్స్‌లో వేలాది ఓట్ల చోరీదారు అయిన తమ పార్టీ చరిత్ర దేశమంతా ‘ఓట్ చోరీ’ క్యాంపెయిన్‌లో సిలబస్‌గా పెట్టగలరా రాహుల్‌గాంధీ? మీ తండ్రిగారు తెచ్చిన ఫిరాయింపు నిరోధక చట్టం కర్ణాటకలో అసెంబ్లీ తీర్మానాలు చేసి మరీ ప్రయోగిస్తరు కానీ, తెలంగాణలో అటకెక్కించేస్తరా రాహుల్ జీ?
ఇట్లా పూటకో రీతిగల్ల నీతి తప్పిన పార్టీ జాతీయపార్టీ ఎట్లా అవుతుంది? ఏ జాతిని తలెత్తుకునేలా చేయగలరు వీళ్లు? ఇవే కారణాలు కదా ‘ఇండియా కూటమి’లో ఏ ఒక్క పార్టీకి కూడా కాంగ్రెస్‌పై నమ్మకం లేకుండా పోవడానికి! దేశానికి స్వాతంత్య్రం తెచ్చినమని చెప్పుకొనే పార్టీ, గాడ్సేల వారసులంటూ రాజకీయ విమర్శలు చేసే పార్టీ, తమ గురివింద కింద నలుపు గమనింపు లేకనే కదా వారి జూబ్లీహిల్స్ అభ్యర్థి పట్టపగలే తంతాం, తరిమేస్తామని రంకెలు వేస్తుంటే మౌన ఆమోద ముద్ర వేస్తున్నది?
ముఖ్యమంత్రీ, ఆయన కుటుంబం అక్రమాలు, దౌర్జన్యాల గురించి మంత్రి కూతురే బాహాటంగా చెప్పినా ఎలాంటి ఉలుకూ లేని దేశోద్ధారక యువరాజు ఎవరికి ఆశాదీపం కాగలరు? మంత్రులు సైతం ఒకరి పట్ల ఒకరి అవమానకర పద ప్రయోగాలు, దూషణలు; ఆర్టీఐ ప్రయోగిస్తే తప్ప సొంత శాఖ నుంచే మంత్రులకు రాని సమాచారం; మంత్రులకు తెలియకుండానే సీఎం నిర్ణయాలు; అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం అవమానించగలిగే తెంపరితనం; విదూషకులను తలదన్నే పార్టీ యంత్రాంగం; మోసం తప్ప మరోటి లేని మంత్రాంగం.. ఎవరి కోసం ఈ కుప్పిగంతులు, ఈ సర్కస్ గెంతులు?
వీరికి మంగళం పాడాల్సిన సమయం వచ్చేసింది. ఈ ప్రహసన, పరిహాసాస్పద పాలనకు కౌంట్‌డౌన్ చెప్పాలి. పర్జన్య శంఖారావం స్థాయిలో సౌండ్ రావాలి. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి. బరిగీసి కొట్లాడి సాధించిన రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశంలోనే మేటిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని త్రికరణ శుద్ధిగా నమ్మే కేసీఆర్‌ను బలోపేతం చేయడం ఇప్పుడు మనందరి అవసరం. కాంగ్రెస్ పార్టీకి ఉన్న జాడ్యాలూ, అవలక్షణాలూ మనను దరిజేర్చలేవు. ఆ విషయం వారికి కూడా అర్థం కావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పక తప్పదు. తెలంగాణ ఇంక ఎంతమాత్రమూ Taken for granted కాదని ఓటు గుద్ది మరీ చెప్దాం. అతిశయోక్తి కాదు మిత్రులారా, రేపటి దేశ ఆశ కూడా మనమే! అందుకు నాందీ ప్రస్తావన జరగాల్సిందే. ఇంట గెలవాలి, రచ్చా గెలవాలి; సర్కస్ కంపెనీ రచ్చను అడ్డుకోవాలి! మర్చిపోకండి… నవంబర్ 11న, కారు గుర్తుకు ఓటు నవ్య భవ్య భవితకు చోటు!