హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ) : పట్టభద్రులకు ‘డాటా ఇంజినీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం’లో భాగంగా ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కార్యాలయం శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్), శ్రీ సత్యసాయి సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ చేపడుతున్నామని తెలిపింది. ప్రోగ్రామింగ్ అండ్ డాటా అనాలసిస్, డాటా ఇంజినీరింగ్ టూల్స్, క్లౌడ్ టెక్నాలజీస్, డాటా విజువలైజేషన్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ సమీపంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలో పట్టభద్రులకు 90 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. కోర్సు పూర్తి చేసిన వారికి ప్లేస్‌మెంట్స్ కల్పించనున్నట్టు స్పష్టంచేసింది. 2021 నుంచి 2024 మధ్య కాలంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులు అని తెలిపింది. ప్రవేశ పరీక్షకు మార్చి 1 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రిజిస్ట్రేషన్ కోసం http://task.telangana.gov.in/ను సందర్శించాలని కోరింది.