కుభీర్ : సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉచిత విద్య అందినప్పుడే అసమానతలు తొలగిపోతాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ( MLA Rama Rao Patel ) పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubheer ) మండలంలోని ధార్ కుభీర్ లో రూ.30 లక్షలతో చేపట్టిన నూతన పాఠశాల భవనానికి స్థానిక నాయకులు, మండల అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించి ప్రభుత్వ అందించే విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను (New Ration card) కుబీర్ రైతు వేదికలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని ఇందులో ఎలాంటి సందేహాలకు చోటు లేదన్నారు.
దేశంలోని ప్రతి పేదవాడికి ఆహార భద్రత కల్పించడం లక్ష్యంగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ఘనత కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డులను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇవి ప్రతి పథకంలోను కీలకంగా మారానున్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా గూడు లేని ప్రతి ఒకరికి తనకు కేటాయించిన కోటా నుంచి ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయ్ కుమార్, ఎంపీడీవో సాగర్ రెడ్డి, తహసీల్దార్ శివరాజ్, ఆత్మ, మార్కెట్ కమిటీ చైర్మన్లు సిద్ధం వార్ వివేకానంద, గోనే కళ్యాణ్, నాయకులు ఏశాల దత్తాత్రి, గోడ పూర్ దత్త హరి పటేల్, బోయిడి అభిషేక్, కందూర్ చిన్న సాయినాథ్, పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.