సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ఉచిత తాగునీటి పథకం పొందే అవకాశాన్ని ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జలమండలి ఎండీ దాన కిశోర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజల కోసం ప్రభుత్వం గత డిసెంబరులో నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు సరఫరా చేసే పథకాన్ని ప్రకటించింది. ఈ పథకాన్ని వినియోగించుకోవడానికి వినియోగదారులు తమ నల్లా కనెక్షన్లకు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు తమ క్యాన్ (CAN) నెంబరుకు ఆధార్‌లింక్ చేసుకోవాలన్నారు. బస్తీల్లో నివసించే వినియోగదారులు మీటర్లు అమర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ క్యాన్‌కు ఆధార్ అనుసంధానం మాత్రం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
మీటరు, క్యాన్ నెంబరుకు ఆధార్ లింక్ చేసుకోవడానికి ఆగస్టు 15 వరకు జలమండలి అవకాశం ఇచ్చింది. అయితే, కొంతమంది ఇంకా మీటరు అమర్చుకోలేదు. మరికొందరు క్యాన్ నెంబరుకు ఆధార్ లింక్ చేసుకోలేదు. ఇది గుర్తించిన జలమండలి గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించింది.
ఈ ఏడాది జనవరి 1 నుంచి గృహవినియోగదారులకు బిల్లులు జారీ చేస్తున్నారు. కానీ ఉచిత తాగునీటి పథకానికి నమోదు చేసుకున్న వారికి నెలకు 20 వేల లీటర్ల వరకు నీటిని వాడుకుంటే బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. 20 వేల లీటర్ల పైన నీటిని వినియోగించుకుంటే మాత్రం ఎంత ఎకువ వాడుకుంటే అంత నీటికి మాత్రమే నల్లా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 31 నాటికి నల్లాలకు మీటరు అమర్చుకోని, ఆధార్ లింక్ చేసుకోని వారికి 2020 డిసెంబరు నుంచి ఈ డిసెంబరు 31, 2021 వరకు కూడా రాయితీ లేని బిల్లులు జారీ చేస్తారని అధికారులు వివరించారు. అయితే, ఈ బిల్లులపై ఎటువంటి ఫెనాల్టీలు, వడ్డీ వసూలు చేయరని, వినియోగదారులు నాలుగు వాయిదాల్లో ఈ మొత్తం బిల్లును చెల్లించుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఉచిత తాగునీటి పథకాన్ని ప్రకటించే ముందు(01.12.2020) బకాయిలు ఉన్న వినియోగదారులు మాత్రం ఆ బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ఆ బిల్లుపై అప్పటికే ఉన్న ఫెనాల్టీలు, వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉచిత తాగునీటి పథకానికి అర్హులైన వినియోగదారులు నీటి మీటర్లు, నల్లా కనెక్షన్‌కు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఈ నెల 31 లోపు పూర్తి చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డొమెస్టిక్ వినియోగదారులు మీ-సేవ కేంద్రాల్లో, జలమండలి వెబ్సైట్లో లాగిన్ అయ్యి తమ క్యాన్ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. వినియోగదారులకు సందేహాలు ఉంటే జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. జలమండలి ఎండీ దాన కిశోర్