చింతపల్లి, జనవరి 16 : విదేశాల్లో ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిని నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను అడిషనల్ ఎస్పీ జి.రమేశ్ శుక్రవారం వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లికి చెందిన ముప్పాళ్ల లీలాకృష్ణ గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసి భారత్‌కు తిరిగి వచ్చాడు. చెడు వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్కడి పరిచయాలను ఉపయోగించుకుని విదేశాలకు వెళ్లాలని ఆసక్తి చూపుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించాడు. ఇప్పటివరకు మొత్తం 8 మంది నుండి సుమారు రూ.85 లక్షల వరకు తీసుకుని మోసం చేసినట్లు గుర్తించారు.
నల్లగొండ జిల్లా పోలేపల్లి రాంనగర్‌కు చెందిన కోయలకార్ కరుణభాయ్ కుమారుడిని విదేశాలకు పంపించి ఉన్నత చదువులు, ఉద్యోగం ఇప్పిస్తానని లీలాకృష్ణ చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేశాడు. దీంతో బాధిత మహిళ చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ముప్పాళ్ల లీలా కృష్ణను పోలీసులు ఈ రోజు ఉదయం మాల్ గ్రామం మర్రిగూడలో రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఇతడు నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పలువురు విద్యార్థులను ఇదే తీరుగా మోసం చేసినట్లు వెలుగు చూసింది. నిందితుడి వద్ద నుండి ల్యాప్‌టాప్, మూడు స్మార్ట్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నేరస్థుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నాంపల్లి సీఐ డి.రాజు, చింతపల్లి ఎస్ఐ ఎం.రామ్మూర్తి, ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.