తిరుపతి : తిరుపతి (Tirupati) లోని టీటీడీ గోశాల (Goshala) ఘటనలపై నలుగురు సభ్యులతో కమిటీ వేయనున్నట్టు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ( BR Naidu ) వెల్లడించారు. శనివారం గోరక్షక్ దళ్ వ్యవస్థాపకుడు కోటి శ్రీధర్, గోరక్షక్ దళ్ తెలంగాణ అధ్యక్షుడు కాలు సింగ్తో కలిసి గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడారు.
గోశాల ఘటనలపై నలుగురు సభ్యులతో కమిటీ వేస్తాం. గోశాలలో ఏం జరుగుతుందో కమిటీ తేలుస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ చేసిన తప్పులను తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గోశాల ఘటనలతో తప్పు చేసినవారు ఎవరైనా తప్పించుకోలేరని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. వైసీపీ హయాంలో గోవుల గడ్డి డబ్బు కూడా తినేశారని, ఆవులను ఒంగోలు తరలించి కమీషన్లకు అమ్మేశారని చైర్మన్ ఆరోపించారు.
గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీ ఇన్నీ కావని, అవినీతి బాగోతం బయటపడుతుందనే రికార్డులు ఎత్తుకెళ్లారని విమర్శించారు. మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై చర్యలుంటాయని అన్నారు. నాడు బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి గోశాలలో అన్యాయాలు కనిపించలేదా అని ప్రశ్నించారు. టీటీడీ అంటే ఒంటికాలిపై లేచే సుబ్రమణ్యస్వామి నిజాలు తెలుసుకోవాలని సూచించారు.