
బేగంపేట్ జనవరి 23 : డీసీఎం ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకా రం.. ఓల్డ్ గాస్మండి ప్రాంతానికి చెందిన అనిల్‌కుమార్ (23) బోయిగూడ ప్రాంతానికి చెందిన రోహిత్ (24) ప్రైవేట్ ఉద్యోగులు. శనివారం రాత్రి 2 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై పీవీ ఘాట్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్నారు. కర్బలామైదాన్ వద్ద అతి వేగంగా దూసుకువచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్‌కుమార్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. రోహిత్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నగర రోడ్లు రక్తసిక్తమయ్యాయి.
ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఓ డాక్టర్‌తో పాటు ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు, ఓ కారు డ్రైవర్ మృతి చెందారు. నలుగురు మృతులు 30 ఏండ్లలోపు వారే. చేతికొచ్చిన కొడుకులు చేదోడు వాదోడుగా ఉంటారనుకునే సమయంలోనే మృత్యు ఒడికి చేరడంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయాయి.
డివైడర్‌ను ఢీ కొట్టి..
బంజారాహిల్స్, జనవరి 23 : అతివేగంగా బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ సైట్-2లో నివాసముంటున్న నిర్మాత సురేశ్‌బాబు కొడుకు అభిరామ్వద్ద నగేశ్(26) గత కొంతకాలంగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమీపంలోనే ఉన్న సురేశ్‌బాబు గెస్ట్‌హౌజ్‌లో నివాసముంటున్నాడు. అయితే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నగేశ్ తన పల్సర్ -200 వాహనంపై జూబ్లీహిల్స్ రోడ్డు నం 86 మీదుగా వెళ్తున్నాడు. హకీంబాబా దర్గా సమీపంలోకి రాగానే అదుపుతప్పిన బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన నగేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
టిప్పర్ కిందపడి డాక్టర్..
మెహిదీపట్నం, జనవరి 23 : ఒక్కగానొక్క కొడుకు. ఎంబీబీఎస్ పూర్తిచేసి డాక్టర్ అయ్యాడు. పీజీ ఎంట్రన్స్ కోసం సిద్ధమవుతున్నాడు. స్నేహితులను కలిసేందుకు బైక్‌పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. బైక్ అదుపుతప్పి టిప్పర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు ప్రయోజకుడయ్యాడు.. తమ బాగోగులు చూస్తాడని అనుకుంటున్న సమయంలోనే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన సంఘటన హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ కె.నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఏపీ రాష్ట్రం విజయవాడకు చెందిన సీహెచ్. రాంగోపాల్ తన కుటుంబంతో నగరానికి వచ్చాడు. 12ఏండ్లుగా కార్వాన్ విశ్వేశ్వర్నగర్ శ్రీకృష్ణభవన్ సమీపంలోని ఉమ రెసిడెన్సీ అపార్టుమెంట్లో నివాసముంటున్నాడు. ఇతడి ఒక్కగానొక్క కొడుకు సీహెచ్.విశ్వకల్యాణ్(24) ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే పీజీ ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రతిరోజు అమీర్‌పేట్‌కు తన బైక్‌పై వెళ్లి వస్తుంటాడు. శనివారం రాత్రి అమీర్‌పేట్ నుంచి స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి ఎన్ఎండీసీ మీదుగా మెహిదీపట్నం వస్తుండగా సరోజినిదేవి కంటి ఆస్పత్రి వద్ద ముందు వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్టేక్ చేయబోయాడు. ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి టిప్పర్ కింద పడ్డాడు. టిప్పర్ చక్రాలు విశ్వకల్యాణ్ తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. హుమాయూన్‌నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.