హైదరాబాద్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) :హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లౌడ్-ఆధారిత నో-కోడ్ వర్క్‌ఫ్లో ఆటోమేషన్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లాట్‌ఫామ్ క్విక్సీ 2022సంవత్సర జీ2 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రోడక్ట్స్ అవార్డును గెలుచుకుంది. దీంతోపాటు టాప్-50 బెస్ట్ డెవలప్మెంట్, టాప్-25 బెస్ట్ ఇండియా సెల్లర్స్, టాప్- 50 బెస్ట్ ఐటీ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ అవార్డులను కూడా క్విక్సీ సొంతం చేసుకుంది. నాలుగు జీ2 అవార్డులు గెలుచుకున్న ఏకైక కంపెనీ హైదరాబాద్‌కు చెందిన క్విక్సీ కావడం విశేషమని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఏటా 60మిలియన్లకుపైగా సాఫ్ట్వేర్ కొనుగోలుదారులు వినియోగించే సాఫ్ట్వేర్ మార్కెట్‌ప్లేస్‌ను జీ2 నిర్వహిస్తున్నది. సాంకేతిక వ్యాపారాలు తమ సామర్థ్యాన్ని చేరుకోడానికి అవసరమైన వాటిని కనుగొనేందుకు, సమీక్షించుకునేందుకు, నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుంది. తమ వార్షిక ఉత్తమ వినియోగదారుల నుంచి అందిన ప్రామాణికమైన, సమయానుకూల సమీక్షల ఆధారంగా ప్రపంచంలోని అత్యుత్తమ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉత్పత్తులకు ర్యాంకులు ఇస్తుంది.