లక్నో : బీజేపీ పాలిత ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో హసన్‌పూర్‌కు తీర్థయాత్రకు వచ్చిన ఒక 23 ఏండ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి హసన్పూర్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, సీఆర్పీఎఫ్కు చెందిన ఒక ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. హర్యానాలోని ఫతేహాబాద్‌కు చెందిన ఒక మహిళ ఈనెల 20న తనకు తెలిసిన ఒక మహిళ చెప్పడంతో అమ్రోహాలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు ముజఫర్‌నగర్ జిల్లాలోని సౌరంగ్ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ మోహిత్‌ను కలిసిందని అమ్రోహా ఎస్పీ లఖన్ సింగ్ యాదవ్ తెలిపారు. బాధితురాలు 21న హర్యానాలోని సోనిపట్‌లో మోహిత్‌ను కలిసింది. అక్కడ నుంచి వారు మీరట్‌కు వెళ్లారు. అక్కడ మోహిత్‌తో అతని సహోద్యోగి, రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ లాలారామ్ యాదవ్ కలిశాడు.
ఆ తర్వాత మోహిత్ తన పరిచయస్తుడైన పోలీసు ఇన్స్పెక్టర్ సంజయ్ తోమర్‌ను కలిసేందుకు అమ్రోహా జిల్లాలోని హసన్పూర్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. సాధారణ దుస్తుల్లో ఉన్న సంజయ్ 22న పోలీసు స్టేషన్ గేటు వద్ద వారిని కలిశారు. ఆ తర్వాత వారు మోహిత్‌కు చెందిన కారులో జుల్పురి ఫామ్‌కు వెళ్లారు. అక్కడకు చేరుకున్న తర్వాత వారు రెండు గదులు తీసుకున్నారు. ఒకదాంట్లో మోహిత్, సంజయ్, లాలారామ్ ఉండగా, మరో గదిలో ఆ మహిళ ఉంది. కొద్దిసేపటి తర్వాత హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్ కూడా వచ్చి చేరాడు. అనంతరం వారు మద్యం సేవించి ఆ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.