వరంగల్: కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయి తరలిస్తున్న నలుగురిని ఆర్పీఎఫ్, డ్రగ్ కంట్రోల్ బృందం అదుపులోకి తీసుకొని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన కథనం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో డ్రగ్ కంట్రోల్ బృందం సీఐ సతీష్, ఎస్సై పూర్ణచందర్, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలో మహారాష్ట్ర డైసర్ కు చెందిన కూలీ ఎండీ అష్రఫ్ షేక్ (40), డోంగ్రి, శాంతినగర్ కు చెందిన రహీం బాబన్ పటేల్ (30), ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగరాజ్ జిల్లాకు చెందిన రాజు ఠాకూర్ (24), మహారాష్ట్ర రత్నగిరి దైసార్ కు చెందిన ప్రవీణ్ శ్యామ్ తవుడే (39) అనుమానాస్పదంగా కనిపించారు. వీరి వద్దనున్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో 8.7 కిలోల ఎండు గంజాయి లభించింది. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని ఆర్పీఎప్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుల వివరాలను సేకరించి డ్రగ్ కంట్రోల్ బృందానికి అప్పగించినట్లు సీఐ తెలిపారు. రైళ్లల్లో గాని లేదా రైల్వే ప్రాంగణాల్లో అనుమానిత వ్యక్తులు తారసపడ్డ లేదా మాదకద్రవ్యాల రవాణా చేస్తున్నట్లు తెలిసిన వెంటనే రైల్వే అధికారులు కానీ పోలీసుల గాని సమాచారం ఇవ్వాలని ప్రయాణికులను కోరారు.