ఖలీల్వాడీ, మే 7: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కుమ్మక్కయి దాడులకు ఎగబడుతున్నాయని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రెండు జాతీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయినా ఆరు గ్యారెంటీలు అటకెక్కించిందని మండిపడ్డారు. రైతు బంధు ను బంద్ చేసి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులతో పాటు ప్రజలకు పలు సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేశామని, వాటిలో ఏ ఒక్కటి కూడా విజయవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుందని విమర్శించారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ను, వారి కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అర్వింద్ తిట్టొచ్చు కానీ, వారిని తిడితే ఓర్చుకోలేక పోతున్నారని అన్నారు. పాలన మరిచిపోయి రాష్ర్టాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారని విమర్శించారు. వారి తిట్లకు కౌంటర్ ఇచ్చిన కౌశిక్ రెడ్డిపై పలు విమర్శలు చేస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాట్లాడితే ఓ తీరు..మరొకరు మాట్లాడితే మరోతీరు ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. ముందు రైతు సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకుని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బాజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విమర్శించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.