నాగర్‌కర్నూల్, మార్చి 15 : గుడిపల్లి రిజర్వార్ నింపి పంట పొలాలకు సాగునీరు అందించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టులోని ఐదు మోటర్లకు గానూ మూడు మోటర్లే పనిచేస్తున్నాయని, వాటి ద్వారా కూడా సక్రమంగా నీటిని విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెగ్యులర్‌గా రెండు మోటర్ల నడిపి గుడిపల్లి రిజర్వాయర్‌ను నింపి రైతుల పంటలకు నీరందిస్తే సరిపోయేదని చెప్పారు.
26డీ కాల్వ పొడవునా ఉన్నపంట పొలాలు నీరందక వాడుపట్టాయని, మొక్కజొన్న గింజపట్టే సమయంలో ఎండితున్నదని చెప్పారు. ఇంజినీర్లు, రాజకీయ నాయకులు కేఎల్ఐని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు మంత్రిగా గుడిపల్లి వద్ద కేఎల్ఐ ప్రాజెక్టుకు పౌండేషన్ వేశానని గుర్తుచేశారు. ఇక్కడి రైతుల ఇబ్బందులను గుర్తించి ప్రాజెక్టు చేపడితే గుడిపల్లి గట్టును నింపకుండా నిర్లక్ష్యం చేస్తూ నేడు పంటలు ఎండిపోవడానికి కారకులయ్యారని మండిపడ్డారు. కనీసం రెండు మోటర్లు నడిపిస్తే పంట పొలాలు ఎండిపోయేవి కాదని, అధికారుల నిర్లక్ష్యంవల్ల చేళ్లన్నీ ఎండుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే 3, 5 మోటర్లు నడిచేలా చర్యలు తీసుకుని, కాల్వ వెడల్పును పెంచాలని డిమాండ్ చేశారు.