తెలంగాణను తప్పించి పోలవరం నుంచే గోదావరి-కావేరి లింక్ పేరిట, కేంద్రం నిధులతోనే జలాలను తరలించుకుపోయేందుకు చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేస్తున్నడు. ఆ కుట్రలను అడ్డుకొని, ప్రశ్నించాల్సింది పోయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంతపాడుతున్నరు. తుగ్లక్ చేతలు, అవగాహనారాహిత్యంతో తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నరు.
జీసీ లింక్ పేరిట నల్లమలసాగర్‌కు, ఆపై ఏపీకి జలాలను తరలించే తాజా ప్రతిపాదనలతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. ఈ లింక్‌తో తెలంగాణకు ఒక్క చుక్క కూడా రాదు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో తెలంగాణ తన వాటా 74టీఎంసీలను కోల్పోతుంది. తాజా ప్రతిపాదనల వల్ల మొ త్తం గోదావరిలో 213 టీఎంసీలను తెలంగాణ నష్టపోవాల్సి వస్తుంది. అయినా కాంగ్రెస్ సర్కార్ నోరుమెదపడం లేదు.
పాలమూరుకు ఎన్వోసీ తీసుకుంటే అపారమైన నష్టం జరుగుతుంది. కృష్ణా నుంచి 16 టీఎంసీలు వాడుకోవాలని, తాము 16టీఎంసీలు గోదావరి నుంచి వాడుకుంటామని ఏపీ చెబుతున్నది.. ఇది ఆచరణలోకి వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ జూరాలపై పడుతుంది. మహబూబ్‌నగర్‌కు నష్టం జరుగుతుంది.. మంచినీళ్లకు కూడా ఇబ్బందులు పడాల్సివస్తుంది. ఆ 16 టీఎంసీలు రాకుంటే పాలమూరు పడావు పడుతది.. ఆ ప్రాంత బిడ్డనని పదేపదే చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ఆ గడ్డకు తీవ్ర ద్రోహం చేస్తున్నరు.
-బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత హరీశ్‌రావు
హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): ‘గురువు చంద్రబాబుకు తొత్తుగా మారి నీరుపారుదల రంగంలో ఉమ్మడి పాలకుల కంటే ఘోరంగా రేవంత్‌రెడ్డి తీవ్ర జలద్రోహం చేస్తున్నడు.. అటు గోదావరి, ఇటు కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్రలను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ అడ్డుకోవాల్సింది పోయి ఎత్తుగడ పేరుతో తొత్తుగడ చేస్తున్నడు. ఆ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ఏడారిగా మారే ప్రమాదం ఉంది’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్శాసనసభాపక్ష డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణను తప్పించి పోలవరం నుంచే గోదావరి-కావేరి లింక్ పేరిట, కేంద్రం నిధులతోనే జలాలను తరలించుకుపోయేందుకు చంద్రబాబు వేస్తున్న కొత్త ఎత్తుగడను అడ్డుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ నేతలు డూడూ బసవన్నల్లా తలూపుతున్నారని మండిపడ్డారు. ఇదేమంటే బనకచర్లకు అనుమతిచ్చి పాలమూరుకు ఎన్వోసీ తీసుకొస్తానని చెప్పడం.. ముమ్మాటికీ తల్లిలాంటి తెలంగాణకు ద్రోహం చేయడమేనని, నల్లమలసాగర్‌కు పాలమూరుకు లింకు పెట్టడమంటే ట్రిబ్యునల్ జలాలపై రాజీపడటమే’ అని దుయ్యబట్టారు. లోపాయికారి ఒప్పందాలతోనే ప్రణాళికాబద్ధంగా కుట్రలను అమలు చేస్తున్నారని, ప్రతిపాదనలకు సంబంధించిన సమావేశాల వివరాలను కూడా బయటకు పొక్కనీయడం లేదని, కనీసం తెలంగాణ ఇంజినీర్లకు కూడా తెలియనివ్వడం లేదని విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో మండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, చింతా ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం ఉదయం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనలు, ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న నీటి కుట్రలు, వాటిపై రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. కొత్త ప్రణాళికలతో తెలంగాణకు వాటిల్లే నష్టాన్ని గణాంకాలతో వివరించారు. తక్షణం ప్రస్తుత ప్రతిపాదనలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు పోతిరెడ్డిపాడు రూపంలో కృష్ణా నదిని ఏపీకి అర్పించి తెలంగాణకు అన్యాయం చేశారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రస్తుతం గోదావరిని కూడా పూర్తిగా మళ్లించేందుకు యత్నిస్తున్నారని వివరించారు. గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు ఏపీ ప్రభుత్వం తొలుత బనకచర్లను తెరపైకి తెచ్చిందని, తెలంగాణకు వాటిల్లే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించడంతో వెనుకడుగు వేసిందని తెలిపారు. ఆ తర్వాత నల్లమలసాగర్ పేరిట చేసిన రెండో కుట్రను కూడా బీఆర్ఎస్ నిలదీసి.. మిగులు జలాలే లేనప్పుడు ఎలా చేపడుతారని ప్రశ్నించిందని గుర్తుచేశారు. ఫలితంగా ఆ ప్రణాళికలను పక్కన పెట్టిందని తెలిపారు. ప్రస్తుతం గోదావరి-కావేరి(జీసీ) నదుల అనుసంధానం పేరిట ఏపీ మూడో కుట్రకు తెరతీసిందని హరీశ్‌రావు నిప్పులుచెరిగారు. పోలవరం నుంచే కావేరి అనుసంధానం చేపట్టి, తద్వారా గోదావరి జలాలను ఏపీకి తరలించుకోవాలనే భారీ కుట్రనే తాజా ప్రతిపాదనల వెనుక దాగి ఉన్నదని, తద్వారా తెలంగాణకు తీరని నష్టమని ఆందోళన వ్యక్తంచేశారు. వాస్తవానికి జీసీ లింక్‌పై ఎప్పటినుంచో చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. ఇచ్చంపల్లి నుంచి లేదంటే సమ్మక్కసాగర్ నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌కు.. అక్కడినుంచి కావేరికి తరలించాలనేది అసలైన ప్రణాళిక అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 2015 జనవరి 6న జీసీ లింక్‌పై నిర్వహించిన మీటింగ్‌కు తానే ప్రత్యక్షంగా హాజరయ్యానని, తెలంగాణకు 1,050 టీఎంసీల అవసరాలుంటాయని, తెలంగాణ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే లింక్ చేపట్టాలని షరతు విధించామని స్పష్టంచేశారు. 2023లో జరిగిన సమావేశంలోనూ తెలంగాణ నీటి హక్కులకు తెలంగాణ వాటా నుంచి ఒక్క చుక్కను ముట్టుకోకుండా ఉంటేనే జీసీ లింక్‌కు అంగీకరిస్తామని, అదీగాక గోదావరి నుంచి మళ్లించే జలాల్లో 50శాతం వాటా ఇవ్వాలని కరాఖండిగా తేల్చిచెప్పారని గుర్తుచేశారు. నాడు బీఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్రం నుంచి సైతం స్పష్టమైన ఆమోదం లభించిందని తెలిపారు. కానీ ఇప్పుడు ఈ ప్రణాళికలన్నింటినీ రద్దు చేశారని, తెలంగాణ భూభాగాన్ని పూర్తిగా తప్పిస్తూ, ఇప్పుడు పోలవరం నుంచి కావేరి లింక్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు, అక్కడినుంచి కావేరికి తరలిస్తే తెలంగాణకు తీరని నష్టమని వివరించారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకున్నదని ప్రశ్నించారు.
జీసీ లింక్ పేరిట నల్లమలసాగర్‌కు, ఆపై ఏపీకి జలాలను తరలించే తాజా ప్రతిపాదనలతో తెలంగాణకు తీరని నష్టమని హరీశ్‌రావు మండిపడ్డారు. జీసీ లింక్‌లో తెలంగాణకు ఒక్క చుక్క రాకుండా పోతుందని, నేషనల్ ప్రాజెక్టు కూడా చేజారిపోతుందని చెప్పారు. గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు అని, పదేండ్ల పాటు కేసీఆర్ పదేపదే అన్ని వేదికలపై చెబుతూ నీటి హక్కులను కాపాడారని గుర్తుచేశారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అనుమతిచ్చేప్పుడు కూడా కేంద్రమే 968 టీఎంసీల అంశాన్ని ప్రస్తావించి, అధికారికంగా తెలంగాణ నీటి హక్కులను గుర్తించిందని తెలిపారు. ఇక 968 టీఎంసీల్లో ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల ద్వారా 828టీఎంసీలకు అధికారికంగా అనుమతులను సాధించుకున్నామని తెలిపారు. ఇంకా సమ్మక్కసాగర్‌కు 47టీఎంసీలు, వార్ధా ప్రాజెక్టుకు 20 టీఎంసీలు, ఎల్లంపల్లికి 40టీఎంసీలు, ఆదిలాబాద్ మైనర్ ఇరిగేషన్‌కు 9టీఎంసీలు, లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టుకు 5టీఎంసీలు తదితర ప్రాజెక్టులకు కలిపి మొత్తం మరో 139టీఎంసీల వినియోగానికి సంబంధించి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. చేతగాని కాంగ్రెస్ ప్రభు త్వం వల్ల పలు డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయని తెలిపారు. ఒకసారి పోలవరం-కావేరి లింక్ చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులిస్తారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. వాటికి అనుమతులు సాధించడం కష్టమవుతుందని వివరించారు. ఇక గోదావరి-కావేరి నదుల అనుసంధానంలో నీళ్లలోనూ తెలంగాణ తన వాటా 74టీఎంసీలను కోల్పోతుందని వెల్లడించారు. తాజా ప్రతిపాదనల వల్ల మొత్తం గోదావరిలో 213 టీఎంసీలను తెలంగాణ నష్టపోవాల్సి వస్తుందని, అయితే కాంగ్రెస్ మాత్రం పట్టించుకోవడం లేదని నిప్పులుచెరిగారు.
పోలవరం-కావేరి లింక్‌తో కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు కలిసి జాతీయ ప్రయోజనాలను విస్మరించి తెలంగాణతో పాటు దేశానికి తీవ్ర నష్టం చేస్తున్నాయని హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ‘ఇందులో అత్యంత ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయని, 83 మీటర్ల ఎత్తుకలిగిన సమ్మక్కసాగర్ నుంచి 180 ఎఫ్ఆర్ఎల్ కలిగిన నాగార్జునసాగర్‌కు నీళ్లు తరలించాలంటే 90 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయాలి.. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం.. పోలవరం నుంచి ప్రకాశం బరాజ్‌కు నీళ్లు తరలించాల్సి ఉంటుం ది.. ప్రకాశం బరాజ్ ఎత్తు 12 మీటర్లు.. ఇక్కడ నుంచి 263 మీటర్లు ఎత్తు కలిగిన బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లాలి.. తెలంగాణ నుంచి తీసుకెళ్తే 97 మీటర్ల లిఫ్ట్.. పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్లాలంటే 250 మీటర్ల లిఫ్ట్ అవసరం.. సుమారు 153 మీటర్ల లిఫ్ట్ పెరుగుతది..ప్రాజెక్టు వ్యయం, మెయింటెనెన్స్, రికరింగ్, కరెంట్ బిల్లులు పెరుగుతాయి.. సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా ప్రకారం ఇచ్చంపల్లి ద్వారా సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తే రూ.48వేల కోట్లు, అదే పోలవరం నుంచి బనచర్ల ద్వారా నీళ్లు తరలిస్తే రూ.82వేల కోట్లు ఖర్చవుతాయి’ అని వివరించారు. అదనంగా రూ.34 వేల కోట్లు వెచ్చించడమెందుకు? తెలంగాణ దేశంలో భాగం కాదా? జాతీయ ఫలాలు మనకు అందకూడదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలు గొప్పగా కిర్తీంచే కేఎల్ రావు సైతం గోదావరి-కావేరి లింక్‌ను తెలంగాణ నుంచే చేయాలని ప్రతిపాదించారని గుర్తుచేశారు. కానీ బీజేపీ కేఎల్‌రావు చెప్పింది వినకుండా ఆంధ్రా ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో కృష్ణా, గోదావరిలో అన్యాయం వెరసి శాశ్వత ద్రోహం జరుగుతుందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘పోలవరం-లింక్ బ్రహ్మాండమని, జల జగడాలకు చెక్.. అని కేంద్రం మాస్టర్ స్ట్రోక్ అంటూ అందమైన ముసుగేసుకొని అద్భుతమైన లీక్‌లు ఇస్తున్నారు.. మీడియాలో సుజలాం.. సుఫలాం అని యాడ్స్ వేసుకుంటున్నరు.. ఈ ప్రాజెక్ట్ అమలైతే ఏపీ సుజలం.. తెలంగాణకు నిష్పలం..’ అని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి తీరు చూస్తుంటే చంద్రబాబు ప్రతినిధిగా సీఎం సీట్లో కూర్చున్నట్టు కనిపిస్తున్నది’ అని తనదైన శైలిలో సెటైర్లతో విరుచుకుపడ్డారు. ‘రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరువు..రాష్ట్ర ప్రయోజనాలు కాపాడు..అవసరమైతే గురువుకు గురు దక్షిణ మరో మార్గంలో చెల్లించుకో.. అన్యాయానికి ఒడిగట్టకు..’అని దెప్పిపొడిచారు. కేంద్ర సర్కార్ సంస్థ కేఆర్ఎంబీ తీరుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ యేడు కృష్ణాలో 25శాతం తెలంగాణ, 75శాతం ఏపీ వాడుకున్నా చోద్యం చూసింది తప్ప నిలువరించలేదని మండిపడ్డారు.
ఏపీ ఎంపీలపై ఆధారపడ్డ కేంద్ర సర్కార్ ఆ రాష్ట్రానికి వత్తాసు పలుకుతూ తెలంగాణకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతజరుగుతుంటే మన రాష్ట్రానికి చెందిన ఎనిమిది బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత వారికి లేదా? ‘రేవంత్‌రెడ్డి అంటే చంద్రబాబుకు లొంగిపోయిండు.. గురుదక్షిణ చెల్లించుకొనే పనిలో ఉన్నడు.. కనీసం మీరైనా మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారా? మీరు కూడా ద్రోహులుగా మిగిలిపోతారా? అని నిలదీశారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి కండ్లు తెరిచి కావేరి-పోలవరం లింక్‌ను ఆపాలని కేంద్రంపై ఒత్తిడితేవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేద్దామంటూ ప్రతిపాదించారు. ఇందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. వెంటనే స్పెషల్ అసెంబ్లీ సెషన్ నిర్వహించి చర్చించి తీర్మానించి కేంద్రానికి పంపుతామని చెప్పారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్తే వచ్చేందుకు తాము సిద్ధమని.. కానీ అన్యాయం చేస్తే ప్రజాపోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. ‘సమ్మక్కసాగర్‌కు వచ్చే 45 టీఎంసీలను వదులుకొనేందుకు వీలు లేదు.. ఎస్సారెస్పీ స్టేజ్-2, దేవాదులకు నీళ్లు అవసరం ఉన్నాయి.. కేటాయింపులు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది.. మూడు నెలలుగా సీక్రెట్ మీటింగ్‌లు జరుగుతున్నాయని, రేపోమాపో ఒప్పందాలు పూర్తవుతాయి’ అని ఆందోళన వ్యక్తంచేశారు. మంత్రి ఉత్తమ్ తీరుపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. రాజకీయాలు కాదు తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పునరుద్ఘాటించారు.
‘పోలవరం-కావేరి లింక్‌పై సీక్రెట్ మీటింగ్‌లు జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒక్క సమావేశానికి హాజరైన్రు.. వాటి వివరాలు..మినిట్స్ మాత్రం బయటపెట్టరు’ అని హరీశ్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. మార్చి 26, 2026న ఏపీ సర్కార్ సెక్రటరీతో పాటు ఆంధ్రా మూలాలు కలిగిన యూనియన్ సెక్రటరీ కాంతారావు హైదరాబాద్‌కు వచ్చి మన సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి, ఈఎన్సీని, నీటిపారుదలశాఖ సలహాదారుతో ఫస్ట్ మీటింగ్‌కు హాజరయ్యారని తెలిపారు. ఏప్రిల్ 27, 2026న ఢిల్లీలో సెంట్రల్ సెక్రటరీ వద్ద జరిగిన మీటింగ్‌లో సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు పాల్గొన్నరు. మే 1,2026న నిర్వహించిన సమావేశంలో తెలంగాణ, ఏపీ సీఎస్‌లు, అడ్వైజర్లు హాజరయ్యారు.. మే 8, 2026న మరో మీటింగ్ జరిగింది.. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి మే 11న ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కుర్చీలో కూర్చొని ఆయన సమక్షంలో మీటింగ్ పెట్టారు.. మే 23న మరో మీటింగ్ పెట్టారు. జూన్ 5న మహానది-పోలవరం లింక్‌కు సంబంధించి ఢిల్లీలో మరో సమావేశం నిర్వహించారు. దీనిద్వారా మరో 140 టీఎంసీలు తీసుకెళ్లాలని నిర్ణయించారు.. ఇన్నిసార్లు మీటింగ్‌లు పెట్టినా మినిట్స్ బయటపెట్టకపోవడంలోని ఆంతర్యమేంటి’ అని ప్రశ్నించారు. ఇక మీటింగ్‌లకు తెలంగాణ తరఫున చంద్రబాబు నమ్మినబంటు, పదేండ్ల పాటు ఏపీ నీటి పారుదల సెక్రటరీగా తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ఆదిత్యానాథ్‌ను తప్ప మన రాష్ట్ర ఇంజినీర్లను కూడా అనుమతించకుండా రహస్యంగా వ్యవహారాలు నడుపుతున్నారని ఆరోపించారు.
తుగ్లక్, అవగాహన లేని కాంగ్రెస్ సర్కార్ తప్పుడు నిర్ణయాలతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనుందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలోనే కాకుండా కృష్ణాలోనూ తెలంగాణ జలహక్కులకు ముప్పు పొంచి ఉందని తెలిపారు. బనకచర్లకు అనుమతిచ్చి పాలమూరుకు ఎన్వోసీ తీసుకొస్తామంటూ రేవంత్ షరతు పెడుతున్నారని, అది అర్థరహితమని.. తద్వారా గోదావరి, కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు తీరని నష్టమని మండిపడ్డారు. వాస్తవంగా పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన 90టీఎంసీలు తెలంగాణవేనని వెల్లడించారు. పోలవరం డైవర్షన్ ద్వారా ఉమ్మడి ఏపీకి దక్కిన 45టీఎంసీలు హక్కుగా తెలంగాణకు రావాల్సినవేనని, విచారణ కొనసాగిస్తున్న ట్రిబ్యునల్ సైతం ఇటీవల అదే అభిప్రాయం వ్యక్తంచేసిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. అదీగాక కేసీఆర్ పోరాటం వల్ల ట్రిబ్యునల్ కొత్తగా విచారణ చేపట్టిందని, ఉమ్మడికి ఏపీకి గతంలో కృష్ణా జలాల్లో కేటాయించిన 1,005 టీఎంసీలు, పోలవరం డైవర్షన్ ద్వారా 45 టీఎంసీలు, మొత్తంగా 1,050 టీఎంసీలను ఇరు రాష్ర్టాల మధ్య పునః పంపిణీ చేసేందుకు విచారణ కొనసాగుతుందని, వాదనలు పూర్తికాగా, ఏ నెలలోనైనా ట్రిబ్యునల్ తీర్పు రాబోతున్నదని చెప్పారు. మొత్తం జలాల్లో అథమంగానైనా 700టీఎంసీలు తెలంగాణకు వస్తాయని నిపుణులు చెబుతున్నారని హరీశ్‌రావు విశ్వాసం వ్యక్తంచేశారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం పాలమూరుకు 90టీఎంసీలకు ఎన్వోసీ ఇస్తే గోదావరి, కృష్ణాలో జలాలను వదిలిపెట్టుకుంటా అని తెలుపుతున్నారని వివరించారు. కాంగ్రెస్ అవగాహనారాహిత్యం వల్ల ప్రస్తుత ట్రిబ్యునల్ వాదనల్లో తెలంగాణకు 90టీఎంసీల మేరకు కోత పడుతుందని హెచ్చరించారు.