Shankersinh Vaghela : గుజరాత్ (Gujarath) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, సీనియర్ నేత శంకర్‌సింహ్ వాఘేలా (Shankersinh Vaghela) తొమ్మిదేళ్ల విరామం తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో చేరేందుకు సిద్ధమయ్యారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ని గద్దె దించడమే లక్ష్యంగా తాను కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. అయితే రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తో భేటీ తర్వాతే తన చేరికపై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టంచేశారు.
వాఘేలా (86) ఇప్పటికే ఏఐసీసీ గుజరాత్ ఇన్‌ఛార్జి రణ్‌దీప్ సూర్జేవాలా.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా, కేంద్ర మాజీ మంత్రి భరత్సింహ్ సోలంకి వంటి నేతలతో చర్చలు జరిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం తాను కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నానని వాఘేలా చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి అవకాశమని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటంలో తన వంతు పాత్ర పోషించాలనుకుంటున్నానని వాఘేలా తెలిపారు. పార్టీ నుంచి తాను ఏమీ ఆశించడం లేదని, పార్టీకి తన వంతు సహకారం అందించడానికే వస్తున్నానని చెప్పారు.
కాగా 2017లో కాంగ్రెస్ పార్టీని వీడిన వాఘేలా.. మళ్లీ ఇన్నాళ్లకు సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి అక్టోబర్ 2న తన సొంత పార్టీ ‘ప్రజా శక్తి డెమోక్రటిక్ పార్టీ (PSDP)’ ని పునరుద్ధరించాలని భావించినప్పటికీ కాంగ్రెస్‌తో చర్చల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. వాఘేలా కుమారుడు మహేంద్రసింహ్ వాఘేలా 2022లోనే కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం వాఘేలా చేరికపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం చేతిలో ఉంది.