RTI Act. | కోల్ సిటీ , మే 31: రామగుండం నగర పాలక సంస్థ అధికారులు ఏం చేసినా విడ్డూరంగానే ఉంటుంది. విడ్డూరంతో పాటు విమర్శలకూ కేంద్ర బిందువుగా ముందు వరుసలో ఉంటుందన్న ఘనత ఉంది. గడిచిన ఏడాది మాసంలో నగర పాలక సంస్థ లావాదేవీలకు సంబంధించి సమగ్ర వివరాలు కావాలని ఒక మాజీ కార్పొరేటర్ సమాచార హక్కు (స.హ) చట్టం ద్వారా దరఖాస్తు చేయగా, నెల రోజులుగా సమాచారం ఇవ్వకపోగా చివరకు జిరాక్స్ లకు రూ.5వేలు చెల్లించాలంటూ మున్సిపల్ నుంచి సదరు మాజీ కార్పొరేటర్ కు నోటీసు పంపించడంతో అవాక్కయ్యారు.
నగర పాలక సంస్థ 25వ డివిజన్ మహిళా కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడుతూ కార్పొరేషన్లో ఏడాది జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఖర్చుల వివరాలు అడిగితే అధికారులు నిరాకరిస్తుండడంతో తాను స.హ చట్టం ద్వారా బల్దియా కార్యాలయంలో దరఖాస్తు సమర్పించినట్లు ఆమె తెలిపారు. గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆదాయ, వ్యయాలు, కార్యక్రమాల ఖర్చులు, పాలక వర్గం పదవీ కాలం ముగింపు సందర్భంగా కార్పొరేటర్ల సన్మానాలకు అయిన ఖర్చులు కావాలని దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు.
నెల రోజులు గడిచిన తర్వాత పూర్తి వివరాలు కావాలంటే రూ.5వేలు ఖర్చుల కింద చెల్లించాలని కార్పొరేషన్ నుంచి తనకు నోటీసు వచ్చిందని తెలిపారు. సమాచారం అడిగితే రూ.5వేలు అడగడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కార్పొరేషన్లోని అన్ని శాఖలలో అవినీతి భారీగా జరుగుతుందనీ, అధికారులు, కాంట్రాక్టర్లు ఆడింది ఆటగా పాడింది పాటగా మారిందని ఆరోపించారు. పలుమార్లు విజిలెన్స్ విచారణ జరిగినా అధికారుల్లో చలనం రావడం లేదన్నారు. 50 డివిజన్లలో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెబుతూ అనవసరమైన ఖర్చులు చేస్తున్నారని వాపోయారు.
కార్పొరేషన్లోని కొందరు అధికారులు కండువాలు లేని కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలో పెద్ద ఎత్తున చేతులు మారుతున్నాయని వాపోయారు. కమిషనర్ తో పాటు ప్రతి అధికారికి ముడుపులు ముడుతున్నాయనీ, దీనిపై జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.