ముంబై, మార్చి 18: విదేశీ మారకం నిల్వలు కరిగిపోతున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో దూసుకుపోయిన దేశీయ విదేశీ మారకం నిల్వలు గత వారంలో 9.646 బిలియన్ డాలర్లు తగ్గి 622.275 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితంవారంలో 394 మిలియన్ డాలర్లు పెరిగి 631.92 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ తొలివారాంతం నాటికి చారిత్రక గరిష్ఠ స్థాయి 642.453 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గతవారానికిగాను విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ కరిగిపోవడం ఇందుకు కారణమని వెల్లడించింది. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 11.108 బిలియన్ డాలర్లు తగ్గి 554.359 బిలియన్ డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డాలరేతర కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్ల విలువ తగ్గడం ఇందుకు కారణమని తెలిపింది. మరోవైపు, పసిడి రిజర్వులు 1.522 బిలియన్ డాలర్లు పెరిగి 43.842 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.