న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై మరో కేసు నమోదైంది. ప్రజా ఆస్తుల చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆయనతోపాటు ఆ పార్టీ నేతలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. 2019లో ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. నాటి సీఎం కేజ్రీవాల్, ఇతర ఆప్ నాయకుల పోస్టర్లు, బ్యానర్లను పలు చోట్ల ప్రదర్శించారు.
కాగా, నాడు అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని దీనిపై ఆరోపణలు వచ్చాయి. అలాగే పెద్ద పోస్టర్లు, బ్యానర్లను నగరంలో అక్రమంగా ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ శివ కుమార్ సక్సేనా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై రూస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. పిటిషన్‌దారుడు సమర్పించిన ఆధారాలను పరిశీలించింది.
మరోవైపు ప్రజా ఆస్తులను పాడు చేసినందుకు కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై కేసు నమోదు చేయాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేహా మిట్టల్ మార్చి 11న ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, మాజీ కౌన్సిలర్ నితికా శర్మపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఏప్రిల్ 18న జరుగనున్నది.