– ఆత్మ శిక్షణ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 09 : ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటి వినియోగంతో సాగు చేయగల పంటల వైపు దృష్టి సారించాలని మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు సూచించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖల అధికారులు అందించే సూచనలు, సలహాలను పాటిస్తే పంటల్లో మెరుగైన దిగుబడులతో పాటు ఆదాయం పొందవచ్చని తెలిపారు.
సహాయ వ్యవసాయ సంచాలకులు (మధిర) ఇమ్మడి వాణిశ్రీ మాట్లాడుతూ… రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులు వినియోగించకుండా, పంటకు అవసరమైన సిఫారసు మేరకే వాడాలని సూచించారు. సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ, జీవ ఎరువులను సమతుల్యంగా వినియోగించడం ద్వారా నేల సారం, నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు పెరిగి పంటల ఉత్పత్తి, నాణ్యత మెరుగుపడతాయని తెలిపారు.
పట్టు పరిశ్రమ సంయుక్త సంచాలకులు ఏ.అనసూయ మాట్లాడుతూ… రైతులు పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టడం ద్వారా అదనపు ఆదాయం పొందడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పామ్ ఆయిల్ సాగు విధానం, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై రైతులకు అవగాహన కల్పించారు. పామ్ ఆయిల్ సాగుతో దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందే అవకాశముందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ బోయినపల్లి సాయి శివ, సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం, సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ వెన్నపూస కృష్ణారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు కంచర్ల వెంకట నరసయ్య, షేక్ ఇస్మాయిల్, ఇనపనూరి వసంతకుమార్, ఏఈఓలు నాగినేని నాగసాయి, ఏడుకొండల బాలకృష్ణ, తానేటి సింధూర్, కూతాటి శైలజ, కూరెళ్ల వంశీకృష్ణసాయి, రైతులు పాల్గొన్నారు.