యూకో బ్యాంక్ ఎండీ, సీఈవో సోమ శంకర ప్రసాద్
హైదరాబాద్, మార్చి 19: ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ యూకో బ్యాంక్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 20 శాఖలను ప్రారంభించనున్నట్లు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సోమ శంకర ప్రసాద్ తెలిపారు. బ్యాంక్ అధిపతిగా నియమితులైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 200 శాఖలను ప్రారంభించాలనుకుంటున్నామని, వీటిలో తెలంగాణలో 10, ఏపీల్లో మరో పది శాఖలను ఆరంభించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీల్లో 81 శాఖలు ఉండగా, వీటిలో 800 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా వెయ్యి మంది సిబ్బందిని నియమించుకున్నట్లు తెలిపారు. బ్యాంక్ మొత్తం వ్యాపారం రూ.3.50 లక్షల కోట్లు కాగా, దీంట్లో తెలుగు రాష్ర్టాల నుంచి రూ.11,700 కోట్ల వ్యాపారం సమకూరుతున్నది. ప్రస్తుతం బ్యాంక్‌లో 4 వేల మంది బిజినెస్ కరస్పాండెంట్లు విధులు నిర్వహిస్తున్నారని, త్వరలో ఈ సంఖ్యను మరింత పెంచుకునే అవకాశం ఉన్నదని చెప్పారు.
వడ్డీరేట్లు పెరిగే అవకాశం
బ్యాంకింగ్ రంగంలో రికార్డు స్థాయికి తగ్గిన వడ్డీరేట్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెరిగే అవకాశం ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లతో బ్యాంక్‌లు మనుగడ సాగించలేవని ఆయన స్పష్టంచేశారు. తక్కువ వడ్డీరేట్లు ఉండటంతో రుణాలకు డిమాండ్ పెరిగే అవకాశాలు లేవని, అవసరం ఉన్నవారు మాత్రమే రుణాలు తీసుకుంటారు తప్ప,తక్కువగా ఉన్నాయని ఎగబడి రుణాలు తీసుకోలేరని ఆయన చెప్పారు. రూపాయి పతనం, ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ఆధారంగా వడ్డీరేట్లపై రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకోనున్నది. ప్రస్తుతం యూకో బ్యాంక్ 6.50 శాతం వడ్డీకి గృహ రుణం, 7.25 శాతం వడ్డీకి వాహన రుణాలు అందిస్తున్నది. మరోవైపు, కరోనాతో రుణాలు తీసుకోవడానికి వెనుకంజ వేసిన కార్పొరేట్ సంస్థల నుంచి ఈ ఏడాది చివరినాటికి డిమాండ్ ఉంటుందని అంచనావేస్తున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది 15 శాతం వృద్ధి
ప్రస్తుతేడాది 12 శాతం నుంచి 15 శాతం వృద్ధి అంచనావేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నదని, గడిచిన ఏడు నుంచి ఎనిమిది త్రైమాసికాలుగా లాభాలను ప్రకటిస్తున్నదన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.800 కోట్ల నుంచి రూ.850 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చునని ఆయన పేర్కొన్నారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.1,000 కోట్ల నికర లాభాన్ని గడించవచ్చునని చెప్పారు. కరోనా సమయంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు డిమాండ్ పెరిగిందని, బ్యాంక్ జారీచేసిన మొబైల్ బ్యాంకింగ్ యాప్‌తోనే అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు పొందవచ్చునని చెప్పారు.