హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ‘నేను సార్ పక్కనే ఉంటా.. ఆయనకు ఎంత చెబితే అంత.. నాలుగున్నర లక్షలిస్తే బదిలీ చేయిస్తా. డిప్యుటేషన్ కావాలంటే రెండు లక్షలు. ఔట్సోర్సింగ్ ఉద్యోగం కావాలన్నా పెట్టిస్తా. అయితే కాస్త ఖర్చవుతుంది,.. ఇది పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేషీలోని ఓ ఉద్యోగి నడుపుతున్న దందా. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లో ఇలాంటి అక్రమ వసూళ్ల ఆరోపణలు సంచలనం సృష్టించాయి. బదిలీలు, డిప్యుటేషన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలంటూ కొందరి నుంచి భారీగా వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యక్తి మాటలు నమ్మి కొందరు డబ్బులిచ్చి మోసపోయారు.
నెలలు గడిచినా ఎంతకు పనులు కాకపోవడంతో తాము మోసపోయామని గుర్తించారు. పెద్ద మొత్తంలో ఇవ్వడంతో కలవరపడ్డ బాధితులు వసూలు చేసుకునేందుకు ఒత్తిడి పెంచారు. ఇటీవల కొందరు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌కు వచ్చి గొడవకు దిగినట్టు సమాచారం. దీంతో సదరు వసూల్ రాజా విధులకు గైర్హాజరయ్యారు. కనీసం ఆఫీసు వైపునకు కూడా రావడంలేదు. ఫోన్లు కూడా ఎత్తడంలేదట. బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.పాఠశాల విద్యాశాఖలో అవినీతి పెచ్చుమీరిందని సాక్షాత్తు అదే శాఖకు చెందిన ఓ ఉద్యోగి వాట్సాప్‌లో పోస్టుపెట్టడం. స్టేటస్లు పెట్టుకోవడం ఇటీవల సంచలనం సృష్టించింది.
రెవెన్యూశాఖ కంటే అధ్వానంగా పాఠశాల విద్యాశాఖ తయారయ్యిందని, కొందరు అధికారులు, సిబ్బంది లంచాలు పుచ్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారంటూ సోషల్‌మీడియాలో పెట్టడం తీవ్ర కలకలం సృష్టించింది. కొందరు అధికారులను లక్ష్యంగా చేసుకుని పోస్టు పెట్టగా, విషయం తెలుసుకుని అధికారులు ఒత్తిడి తెచ్చి పోస్టులు డిలీట్ చేయించారట. ఇదిలా ఉంటే ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు, సీబీఎస్ఈ స్కూళ్లకు ఎన్వోసీల జారీ, మెడికల్ బిల్లులు, పెండింగ్ ఫిక్సేషన్, లాంగ్ లీవ్ తర్వాత మళ్లీ విధుల్లో చేరేందుకు, పెన్షన్ ఫైళ్ల క్లియరెన్స్ దందా నడుస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
కొంతకాలం డైరెక్టరేట్ కార్యాలయంలోని ఉద్యోగిపై ఏసీబీ దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నది. ముఖ్యంగా జీవో-317 అమలు విషయంలో భారీ దందా నడిచినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కొందరు కోర్టును ఆశ్రయించాలని అధికారులే పురమాయించి, ఉత్తర్వులు రాగానే కోర్టు ఆదేశాల పేరిట అమలు చేశారట. మరికొందరు కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా అమలు చేయలేదట. కోర్టుధిక్కరణ కేసులు వేసినా కూడా ఖాతరు చేయలేదట. దీని వెనుక కూడా భారీ తతంగమే జరిగినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు.