వీణవంక, మార్చి 8 : పెద్ద చెరువులో సరిపడా నీళ్లులేక చేపలు చనిపోతున్నాయని కరీంనగర్ జిల్లా వీణవంకలోని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యదర్శి రాయిశెట్టి కుమారస్వామి, డైరెక్టర్లు చుక్కల రవీందర్, రాయిశెట్టి రవి, రాము, ఓదెలు ఆందోళన వ్యక్తంచేశారు.
ఆదివారం వారు వీణవంకలో మీడియా తో గోడువెళ్లబోసుకున్నారు. వీణవంక పెద్ద చెరువులో సరిపడా నీళ్లు లేక నాలుగు రోజులుగా ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో చేపలు చనిపోతున్నాయని తెలిపారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆ చెరువుపై ఏడు గ్రామాలకు చెందిన 300 మత్స్యకార్మిక కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.