వాషింగ్టన్, మార్చి 29: పశ్చిమాసియా యుద్ధం కీలక అంకానికి చేరుకుంది. నెల రోజులపాటు యుద్ధం సాగిస్తున్నా లొంగని ఇరాన్‌ను తుది దెబ్బతీయడానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధపడుతున్నది. ఇరాన్ గడ్డపై భూతల దాడులు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నది. 3,500 మంది మెరైన్లు, సైనికులతో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీ ఈ నెల 27న పశ్చిమాసియాకు చేరుకుంది. జపాన్‌లో విన్యాసాలు చేస్తున్న ట్రిపోలి యుద్ధనౌకను పశ్చిమాసియాకు తరలించారు. ఎన్ని దాడులు చేసినా ఇరాన్ లొంగే పరిస్థితి కన్పించకపోవడంతో ఆఖరి అస్త్రంగా భూతల దాడులు చేయడానికి అగ్రరాజ్యం సిద్ధమైంది.
సైనికుల మోహరింపును యూఎస్ సెంట్రల్ కమాండ్ నిర్ధారించింది. ట్రంప్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతి రాగానే దాడులు ప్రారంభిస్తామని తెలిపింది. కాగా, 844 అడుగుల పొడవుండే ట్రిపోలి నౌక 20 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తుంది. 44 వేల టన్నుల బరువును మోసుకుపోగల ఈ నౌక ఒకే సమయంలో 20 ఎఫ్-358 స్టెల్త్ ఫైటర్లు, ఎంవీ-22 ఆస్ప్రే విమానాలు, హెలికాప్టర్లను మోసుకుపోగలదు. కాగా, ఇరాన్‌పై భూతల దాడికి పెంటగాన్ కొన్ని వారాల నుంచి సిద్ధమవుతున్నదని, అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ కార్యాచరణలో ప్రత్యేక దళాలు, సాధారణ దళాలు కూడా ఉన్నాయి. అయితే ట్రంప్ ఏ ప్రణాళికకు ఆమోదం తెలుపుతారన్నది నిర్ధారణ కాలేదని పేర్కొన్నది.
నెతన్యాహు చేతిలో పావుగా ట్రంప్
ఇరాన్‌లోని ఏ దీవులనైనా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినా, భూతల దాడులు ప్రారంభించినా అమెరికా బలగాలు పర్షియన్ గల్ఫ్‌లోని సొర చేపలకు మంచి ఆహారంగా మారిపోతారని ఇరాన్ మిలిటరీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ దేశ బ్రిగేడియర్ జనరల్ ఇబ్రహీం జోల్ఫఖారీ ఒక వీడియో ప్రకటన విడుదల చేస్తూ అమెరికా దళాలు ఏదైనా దాడి లేదా ఆక్రమణకు పాల్పడితే, అమెరికా బలగాలకు సమయం ఆసన్నమైనట్టేనని పేర్కొన్నారు. ‘ఎప్స్టీన్ ఫైళ్లలో చిక్కుకున్న ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేతిలో పావుగా మారిపోయారు. అందుకే ఉగ్రవాద సంస్థ మొస్సాద్ ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ ఇరాన్‌పై అక్రమంగా దాడులకు పాల్పడుతున్నారు’ అని ఆయన ఆరోపించారు.
అమెరికా దాడులకు మేం సిద్ధమే
అమెరికా భూతల దాడులు చేస్తే, ఎదుర్కోడానికి తాము సిద్ధమేనని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. తమ సైనిక దళాలు అందుకు సిద్ధంగా ఉన్నాయని, యూఎస్ జరిపే మిలిటరీ చర్యకు దాని మిత్ర దేశాలు కనుక సహకారం అందిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన పేర్కొన్నారు. ఒక పక్క ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామంటూ బహిరంగంగా ప్రకటిస్తున్న అమెరికా, మరో వైపు ఇలా ప్రైవేట్‌గా మిలిటరీ దాడులకు సిద్ధపడుతున్న ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు.
అంత సులభం కాదు..
పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం ఖర్గ్ దీవిలో ఉంది. దానిని కనుక అగ్రరాజ్యం స్వాధీనం చేసుకుంటే ఇరాన్‌ను ఆర్థికంగా రెక్కలు విరిచినట్టు అవుతుందని, దీంతో దానికి తమ మాట వినడం తప్ప ఇరాన్‌కు మరో గత్యంతరం ఉండదని అమెరికా భావిస్తున్నది. ఇదంతా ఆఖరి నిమిషపు ప్రణాళిక కాదని, ఇది యుద్ధ క్రీడ అని అమెరికా మాజీ రక్షణ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఈ దీవిని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు అంత సులభం కాదు. కాగా అమెరికా ప్రారంభించనున్న భూతల దాడి ద్వారా ప్రధానంగా నాలుగు అంశాలను లక్ష్యంగా చేసుకుంది. అవి.. ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం, హొర్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించడానికి ఉపయోగకారిగా ఉన్న లారక్ దీవిని లక్ష్యంగా చేసుకోవడం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హక్కులు కోరుతున్న సమీప దీవులతో పాటు అబుముసాను స్వాధీనం చేసుకోవడం, ఈ ప్రాంతం నుంచి చమురును ఎగుమతి చేస్తున్న ఇరాన్ వాణిజ్య చమురు నౌకలను అడ్డుకోవడం.
ఖర్గ్ దీవే ప్రధాన లక్ష్యం
ఇరాన్‌పై భూతల దాడి ద్వారా ఆ దేశ ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవాలని అమెరికా భావిస్తున్నది. ఇప్పటికే వేలాది మంది యూఎస్ మెరైన్ సైనికులు పశ్చిమాసియాలో మోహరించి ట్రంప్ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం నెలలు కాదు వారాల్లోనే ముగుస్తుందన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు ఈ యుద్ధ సన్నాహాలను బలపరుస్తున్నాయి. అయితే ఇరాన్ భూభాగంలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)ని ఎదుర్కోవడం అమెరికా సైనికులకు కత్తిమీద సాము లాంటిదే. తమ భూభాగంలోకి అమెరికా సైనికులు అడుగుపెడితే శవాలుగా మారి వెళతారని ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.