హైదరాబాద్ : నగరంలోని హైదర్‌గూడ పరిధిలోని అవతినగర్లో సోమవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటల ధాటికి ఒకరు సజీవ దహనమవగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు చెలరేగాయి. ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని గౌరీనాథ్ (38) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయాలకు గురైన వారిని వెంటనే హైదర్‌గూడలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.