మెజారిటీ రాకపోయినప్పటికీ, ఐదేండ్ల కిందట మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ సర్కారుకి రానున్న అసెంబ్లీ ఎన్నికలు పెద్ద తలనొప్పులను తీసుకొస్తున్నాయి. పార్టీలో లుకలుకలు, టికెట్ రానివారిలో అంతకంతకూ పెరుగుతున్న అసంతృప్తి, ఎన్నికల్లో గెలువగానే సీఎం మార్పు ఉండబోతున్నదన్న సంకేతాలు వెరసి కమలదళాన్ని ఊపిరిసలపకుండా చేస్తున్నాయి. ఇదే సమయంలో విపక్షాలు ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నాయి.
ఈ నెల 28, మార్చి 5వ తేదీల్లో రెండు విడుతల్లో మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా వారం రోజులు కూడా లేని వేళ అధికార బీజేపీలో సీఎం అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతున్నది. మణిపూర్ అసెంబ్లీలో 60 సీట్లు ఉన్నాయి. 2017లో బీజేపీకి 21 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 28 సీట్లు వచ్చాయి. సీట్ల పరంగా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. 21 సీట్లు మాత్రమే వచ్చిన బీజేపీ నాగా పీపుల్స్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ తదితరుల సాయంతో అధికారాన్ని కైవసం చేసుకొన్నది. మణిపూర్‌లో బీజేపీ మొట్టమొదటిసారి అధికారంలోకి రావడంలో ప్రస్తుత సీఎం బీరేన్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. 2017 ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. రాజకీయంగా ఆయనకు ఉన్న అనుభవం, అన్ని పార్టీలతో ఉన్న సత్సంబంధాలతో మద్దతు కూడగట్టారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తిని సీఎం చేయడంపై అప్పుడే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
అస్సాంలో జరిగినట్టే..
అస్సాంలో సర్బానంద సోనోవాల్‌ను మార్చి హిమంత బిశ్వ శర్మను సీఎం చేసినట్టే, మణిపూర్‌లో కూడా రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రస్తుత సీఎం బీరేన్ సింగ్‌ను మార్చి వేరేవారికి సీఎం పీఠాన్ని అప్పజెప్తారని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకొంటున్నారు. ఆరెస్సెస్ ముఖ్యులు కూడా ఇదే అంశాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. బీజేపీలో ఉన్న విభేదాల వల్లే ఎన్నికల వేళ ఈ చర్చ బయటకు వచ్చిందని, ఇది ఎన్నికల్లో బీజేపీ సీట్లపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం మార్పు వార్త బయటకు రాగానే బీరేన్ సింగ్ మద్దతుదారులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. సీఎంగా గడిచిన ఐదేండ్లలో బీరేన్ అధికారం అంత సాఫీగా కూడా ఏం సాగలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడం, సొంత పార్టీ, మిత్ర పక్షాల్లో అసమ్మతివాదులను బుజ్జగించడంతోనే సరిపోయింది.
కొత్త సీఎంగా ఇద్దరి పేర్లు
బీరేన్ కాకపోతే ఎవరు సీఎం అవుతారంటే బిశ్వజిత్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. బీరేన్‌కు, బిశ్వజిత్‌కు మధ్య మొదటి నుంచి పొసగడం లేదు. బీరేన్‌కు బదులు బిశ్వజిత్‌ను సీఎం చేయాలని ఆయన మద్దతుదారులు గతంలో రెండు మూడు సార్లు పార్టీ అధినాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. బిశ్వజిత్ పలుకుబడి పెరుగుతున్న కారణంగా ఆయన అధికారాలకు కత్తెర వేయడానికి బీరేన్ కూడా ప్రయత్నించారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించారు. కానీ పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సీఎం పీఠం కోసం బిశ్వజిత్ కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. బిశ్వజిత్ కాకపోతే పార్టీ సీనియర్ నేత గోవిందాస్ కొంతౌజమ్కు ఆరెస్సెస్ మద్దతు ఉన్నట్టు తెలుస్తున్నది. ‘2017లో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంలో బీరేన్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. బీజేపీ ప్రభుత్వం ఐదేండ్లు కొనసాగడానికి కాంగ్రెస్తోఆయనకు ఉన్న సంబంధాలు ఉపయోగపడ్డాయి. ఇప్పుడు పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తే ఆయననే సీఎంగా కొనసాగించాల్సిన అవసరం లేదు’ అని ఆరెస్సెస్ నేత ఒకరు చెప్పారు. ఈ వార్తలపై సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. సీఎం అభ్యర్థి ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు.