Reproduction | న్యూఢిల్లీ : చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు రెండు మగ ఎలుకలను ఉపయోగించి, సంతానాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా, ఆ సంతానం ఎక్కువ కాలం జీవించేలా చేయగలిగారు. స్టెమ్ సెల్ రీసెర్చ్, పునరుత్పాదక వైద్య రంగంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ అధ్యయన నివేదిక ‘సెల్ స్టెమ్ సెల్’ జర్నల్‌లో ప్రచురితమైంది. పాలిచ్చే జంతువుల్లో ఒకే జాతి జంతువులను ఉపయోగించి సంతానోత్పత్తి చేయడంలో గతంలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవి. వాటిని ప్రస్తుత పరిశోధన అధిగమించగలిగింది. జీన్ ఎడిట్స్ వల్ల ఎక్కువ కాలం జీవించే బై-ప్యాటర్నల్ యానిమల్స్‌ను సృష్టించగలిగినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ విధంగా రూపొందిన స్టెమ్ సెల్స్‌కు మరింత ఎక్కువ స్థిరమైన ప్లురిపొటెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. శరీరంలో ఏదైనా సెల్ లేదా టిష్యూగా మారగలిగేవాటినే ప్లురిపొటెంట్ స్టెమ్ సెల్స్ అంటారని చెప్పారు.
పునరుత్పాదక వైద్య రంగంలో మరింత అభివృద్ధికి తమ పరిశోధన బాటలు పరుస్తుందని తెలిపారు. ఈ పరిశోధన ఫలితాల ఆధారంగా కోతులు వంటి పెద్ద జంతువుల్లో కూడా సంతానోత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు కూడా రెండు మగ ఎలుకలను ఉపయోగించి సంతానోత్పత్తి చేయగలిగారు. ఒక మగ ఎలుక చర్మ కణాలను మూల కణాలుగా మార్చారు. అనంతరం వాటిలోని ‘వై’ క్రోమోజోములను తొలగించి, వాటి స్థానంలో ‘ఎక్స్’ క్రోమోజోములను ప్రవేశపెట్టారు. వాటిని అండాలుగా తయారయ్యేలా చేశారు. వేరొక మగ ఎలుక వీర్యంతో ఫలదీకరణం చెందించారు. ఫలితంగా 600 పిండాలు ఏర్పడ్డాయి. వాటిని సరోగేట్ ఎలుకలో ప్రవేశపెట్టారు. ఆ ఎలుక ఏడు పిల్లలకు జన్మనిచ్చింది.