న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి 5వ తేదీన పంజాబ్‌లో ప్రధాని మోదీకి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఫిరోజ్పూర్లో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రధాని మోదీని రైతులు అడ్డుకున్నారు. దీంతో మోదీ కాన్వాయ్ ఓ బ్రిడ్జ్‌పై అరగంటకు పైగా నిలిచిపోయింది. ఆ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తన రిపోర్ట్‌ను ఇచ్చింది. ఆ రిపోర్ట్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫిరోజ్‌పూర్ సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు తన విధుల్ని సరైన రీతిలో నిర్వర్తించలేదని కోర్టు పేర్కొన్నది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రధాని మోదీ భద్రతను పటిష్టం చేసే అంశంలో చర్యలు తీసుకోవాలని కమిటీ చేసిన సూచనను ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఇందూ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ ఈ రిపోర్ట్‌ను తయారు చేసింది.
శాంతి, భద్రతల అమలు విషయంలో ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ విఫలం అయ్యారని, కావాల్సినంత సిబ్బంది ఉన్నా ఎస్ఎస్పీ విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించారని, ప్రధాని మోదీ వెళ్లే మార్గం గురించి రెండు గంటల ముందు చెప్పినా ఆయన సరైన చర్యలు తీసుకోలేదని కమిటీ తన రిపోర్ట్‌లో తెలిపింది. ప్రధాని భద్రత అంశంలో దిద్దుబాటు చర్యలు అవసరమని, పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చే అంశంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. వీవీఐపీలకు సెక్యూర్టీ కల్పించే అంశంలో ప్లానింగ్ అవసరమని కోర్టు తెలిపింది. కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి పంపనున్నట్లు సీజేఐ రమణ తెలిపారు.