నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయ పార్టీలు.. అశేష జనవాహిని ఒక్క చోటుకు చేరిన అరుదైన వేదిక ఖమ్మం బహిరంగ సభ దేశానికి చూపిన సంకేతమేమిటి? ప్రజలకు ఇచ్చినసందేశమేమిటి? ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు వీధుల్లోకి వచ్చే అలవాటు అంతగాలేని భారతదేశంలో, జనంలో అంతర్లీనంగా ఉన్న ఆక్రోశాన్ని పట్టిచూపే సాధనాల్లో బహిరంగ సభ ఒకటి! నిన్నటి ఖమ్మం సభ రేపటి జాతీయ నిరసనకు నిశ్శబ్ద సూచికనా?సీనియర్ పాత్రికేయుడు, రాజకీయపరిశీలకుడు బుద్ధా మురళి విశ్లేషణ..
రాజకీయ పక్షాలు రాజకీయమే చేయాలి. రాజకీయమే చేస్తాయి. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కచ్చితంగా రాజకీయ సభనే. అయితే అది మతాలు, కులాలు, రాజకీయ పక్షాల మధ్య చిచ్చు రేపే రాజకీయ సభ కాదు. కేంద్రానికి సమాఖ్య స్ఫూర్తిని గుర్తు చేసిన సభ. రాష్ట్రాల హకులు కేంద్రానికి గుర్తు చేసిన సభ. మా రాష్ట్రంలో ఈ అభివృద్ధి సాధించాం.. మీ రాష్ట్రంలో మంచి విధానాలు ఏమిటి? మీ రాష్ట్రంలో మేం అనుసరించదగిన విధానాలు ఏమిటి? అని వివిధ రాష్ట్రాలు చర్చించుకున్న అభివృద్ధి ఎజెండా రాజకీయ సభ. తెలంగాణలో అమలు చేస్తున్న కంటి వెలుగు పథకాన్ని చూసి అప్పటికప్పుడే ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్ తమ రాష్ట్రాల్లో దానిని అమలు చేయాలని నిర్ణయించుకోవడం శుభ పరిణామం. రాష్ట్రాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలో ఈ సభ ద్వారా ముఖ్యమంత్రులు దేశానికి సందేశం ఇచ్చారు. ఖమ్మం సభలో నలుగురుముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
తమ రాష్ట్రాల్లో అమలు అవుతున్న పథకాలు, కేంద్రం రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్ష, బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం చూపిస్తున్న కక్ష సాధింపు చర్యలు దేశానికి వెల్లడించటానికి ఖమ్మం సభ దోహదం చేసింది. మోదీ ప్రధాని పదవి చేపట్టిన కొత్తలో రెండు ప్రకటనలు చేశారు. ఒకటి పాకిస్థాన్‌ను ఉద్దేశించి చేసిన ప్రకటన కాగా, మరొకటి దేశంలోని అన్ని రాష్ట్రాలను ఉద్దేశించి చేసిన ప్రకటన. తీవ్రవాద దాడులను ఖండిస్తూ పేదరికంపై రెండు దేశాలు పోటీపడి ఎవరి బలం ఏమిటో చూపిద్దాం అన్నారు. ఇక దేశంలోని ముఖ్యమంత్రులను ఉద్దేశించి మనమంతా ముఖ్యమంత్రుల టీమ్‌గా పనిచేద్దాం అని పిలుపునిచ్చారు. కానీ, ఆచరణలో రాష్ట్రాల హకులను కాలరాసేలా వ్యవహరిస్తున్నారు.
మోదీ రెండోసారి అధికారం చేపట్టాక రాష్ట్రాలను పూర్తిగా చిన్న చూపు చూస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి అడుగడుగునా అడ్డు పుల్లలు వేస్తున్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.
మాట వినని రాష్ట్రాలకు నిధుల్లో కోత విధిస్తున్నారు. ఆర్థిక అంశాల్లో అష్టదిగ్భంధం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. ఖమ్మం సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఇదే మాట చెప్పారు. గవర్నర్లు కీలుబొమ్మలు పాపం వాళ్లేం చేస్తారు, ఢిల్లీ పెద్దలు చేయమన్నట్టు చేస్తారు అని విమర్శించారు.
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్ల వ్యవహారం బహిరంగమే. గవర్నర్లుగా తమ బాధ్యతలు నిర్వహించటం కన్నా బీజేపీ తరఫున పనిచేయటం ఎక్కువ. కేజ్రీవాల్ చెప్పిన దాని ప్రకారం గవర్నర్లు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. కేరళ, తమిళనాడు, బెంగాల్, తెలంగాణ, ఢిల్లీలో గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యర్థి పార్టీ నాయకుల్లా తలపడుతున్నారు.
ఇప్పటి వరకు బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఎవరికివారు తమ తమ స్థాయిలోనే పోరాటం చేశారు. తమిళనాడు గవర్నర్ తీరు దేశం విస్తు పోయే విధంగా ఉన్నది. గెట్ అవుట్ రవి అంటూ గవర్నర్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అధికార పక్షం పోరాటం చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఏ రాజకీయ పక్షం అయినా ప్రజాభిమానం పొంది అధికారంలోకి రావాలి. కానీ ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తూ గవర్నర్ ద్వారా పాలించాలనుకోవటం సరికాదు. ఖమ్మం సభ ద్వారా బీజేపీయేతర ముఖ్యమంత్రులు ఏకమై కేంద్రానికి గట్టి సంకేతాలే పంపించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలూ గవర్నర్ల బాధితులే. వారు సభకు రానంత మాత్రాన బీజేపీకి అనుకూలం, సభకు వ్యతిరేకం అని ఏమీ కాదు. ఎవరి పరిస్థితులు వారివి. ఒక వేదిక ఏర్పాటు కాగానే అంతా ఒకే సారి రావాలి అని లేదు. పరిస్థితులను బట్టి ఏకమవుతుంటారు. బీజేపీయేతర పక్షాలకు ఒక వేదిక లభించడం విశేషం. ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వెళ్తే చూస్తూ ఉరుకోం, ఐక్యంగా పోరాడుతాం అని ఒకే వేదిక నుంచి సందేశం ఇవ్వడం ముఖ్యం.
దేశం వాడుకొంటున్న నీళ్లు 20 వేల టీఎంసీలే
అఖిలేశ్, కేజ్రీవాల్ స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. భగవంత్ సింగ్ మాన్ పంజాబ్ పౌరుషాన్ని రగిలించారు. నీళ్లు, వ్యవసాయంపై కేసీఆర్ గణాంకాలతో సాగిన ప్రసంగం ఆలోచింపజేసేలా ఉన్నది. అమెరికా మనకన్నా రెండున్నర రెట్లు పెద్దది. కానీ వాళ్లకు ఉన్న వ్యవసాయభూమి 29 శాతమే. చైనా మన కన్నా ఒకటిన్నర రెట్లు పెద్దది. వాళ్లకున్న సాగు భూమి 16 శాతం మాత్రమే. మొత్తం భారత భూభాగం 83 కోట్ల ఎకరాలుంటే అందులో సరాసరి 50 శాతం అంటే 41 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలం.అపారమైన జల సంపద మన సొంతం. ఈ దేశంలో 1.40 లక్షల టీఎంసీల వర్షపాతం కురుస్తుంది. ఇందులో రమారమి 70 వేల టీఎంసీలు ఆవిరైపోయినా, మనం ఉపయోగించుకునేందుకు 70-75 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. కేంద్రప్రభుత్వ సంస్థ సీడబ్ల్యూసీ చెప్పిన లెకల ప్రకారం.. 70 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే, ఈ రోజు దేశం వాడుకుంటున్నది నికరంగా 20 వేల టీఎంసీలే. దేశానికి నాయకత్వం వహిస్తున్నవారు ఇలాంటి అంశాలు ఆలోచించాలి కానీ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదు.
ప్రజల కోసం రాజకీయాలు ఉండాలి
ఖమ్మం సభ రోజే మీడియాలో ఒక వార్త వచ్చింది. మైనారిటీలకు దగ్గర కావాలి అని ప్రధాని మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ నేతలకు చెప్పినట్టు వార్త. బీజేపీకి ఓటు వేస్తారా? వేయరా? అని చూడకుండా ముస్లిం, ఇతర మైనారిటీ విద్యావంతులతో కలిసి మాట్లాడాలని, సన్నిహితంగా ఉండాలని మోదీ చెప్పినట్టు వార్త.
142 కోట్ల మంది ప్రజలున్న దేశంలో కులం పేరుతో, మతం పేరుతో కొన్ని కోట్ల మందిని దూరం పెట్టి దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుంది? ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తర్వాత కూడా సురక్షితమైన తాగునీరు, విద్యుత్తు లేని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది మతంపై మతంతో పోరాడే తత్వం కాదు. సమస్యలపై పోరాడే గుణం కావాలి.దేశంలో కనీస అవసరాలు తీర్చే సామర్థ్యం కావాలి. ఈ దిశగా కేంద్రం ఆలోచించేలా ఖమ్మం సభ చేస్తుందని ఆశిద్దాం. పాలకులు ప్రజల కోసం ఆలోచించేలా ప్రతి రాష్ట్రంలో ఖమ్మం తరహా సభలు జరగాలి. ప్రజల కోసం రాజకీయాలు ఉండాలి.
(వ్యాసకర్త: ప్రముఖ పాత్రికేయుడు)