వాషింగ్టన్: విమానం టాయిలెట్ సీటుకు ఐఫోన్ అంటించి ఉండటాన్ని ఒక బాలిక గుర్తించింది. ( iPhone To Plane’s Toilet Seat) ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 2న 14 ఏళ్ల బాలిక తన పేరెంట్స్‌తో కలిసి షార్లెట్ నుంచి బోస్టన్‌కు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించింది. టాయిలెట్లోకి వెళ్లేందుకు ఆ బాలిక వేచి ఉండటాన్ని విమాన సిబ్బందికి చెందిన ఒక వ్యక్తి గమనించాడు. బిజినెస్ క్లాస్‌లోని టాయిలెట్‌ను వినియోగించుకోవాలని ఆమెకు చెప్పాడు. తనతో పాటు అక్కడికి తీసుకెళ్లాడు. చేతులు కడుక్కొని వస్తానని చెప్పి ఆ టాయిలెట్లోకి వెళ్లాడు. టాయిలెట్ సీటు వద్ద రహస్యంగా ఐఫోన్‌ను అంటించి బయటకు వచ్చాడు.
కాగా, ఆ బాలిక ఆ టాయిలెట్‌ను వినియోగించింది. చివర్లో సీటు విరిగినట్లు ఉన్న స్టిక్కర్ లోపల ఐఫోన్ ఉన్నట్లు గమనించింది. ఆ ఫోన్ కెమెరా ఆన్‌లో ఉన్నట్లు తెలిసి షాక్ అయ్యింది. దానిని ఫోటో తీసి తన పేరెంట్స్ వద్దకు వెళ్లి చూపించింది.
మరోవైపు బాలిక తల్లి ఆ టాయిలెట్ వద్దకు వెళ్లి చూడగా ఆ వ్యక్తి అప్పటికే ఆ ఐఫోన్‌ను అక్కడి నుంచి తొలగించాడు. ఈ నేపథ్యంలో విమానం ల్యాండ్ కాగానే బాలిక పేరెంట్స్ అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నది.