ముగిద్దామిలా శివరాత్రి వేళ ఉపవాస దీక్షలు చేస్తారంతా! పొద్దంతా నిలారం ఉండి.. సాయంత్రానికి బడలిపోతారు. కాయో, ఫలమో ఆరగించినా.. నిస్సత్తువ వదిలిపోదు. సాబుదానా, చిలగడ దుంపతో సిద్ధం చేసిన సాత్విక ఆహారం తీసుకుంటే.. శరీరానికి సత్వర శక్తి వస్తుంది. ఆపై రాత్రంతా జోగకుండా జాగారం చేసేయొచ్చు కూడా! అందుకే మీ ఉపవాస దీక్షకు ఈ చిట్టి వంటలతో రుచికరంగా ముగింపు పలకండి.
సాబుదానా పొడిపొడిగా..
కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం: రెండు కప్పులు
ఆలుగడ్డ: పెద్దది ఒకటి
పల్లీలు: అరకప్పు
జీలకర్ర: టేబుల్ స్పూన్
పంచదార: టేబుల్ స్పూన్
(ఇష్టాన్ని బట్టి)
పచ్చిమిరపకాయలు: నాలుగైదు
కరివేపాకు: రెండురెబ్బలు
కొత్తిమీర: కొద్దిగా
సైంధవ లవణం: తగినంత
తయారీ విధానం
సగ్గుబియ్యాన్ని తెలుపు రంగు పొడి పోయేలాగా శుభ్రంగా కడగాలి. తర్వాత రెండు కప్పుల సగ్గుబియ్యానికి అంతే లెక్కన నీళ్లు పోసి 5-6 గంటలు నానబెట్టాలి. పల్లీలను వేయించి కచ్చాపచ్చాగా పొడి చేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డను చెక్కుతీసి మీడియం కన్నా కాస్త చిన్న ముక్కలుగా తరిగి కొద్దిగా ఉడికించి పక్కకు పెట్టాలి. ప్యాన్‌లో నూనె వేసి అందులో జీలకర్రవేసి వేగనివ్వాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అరనిమిషం ఉంచాలి. తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేయాలి. వంటకు సరిపడా సైంధవ లవణం, పంచదార కూడా వేయాలి. ముక్కలు కాస్త వేగాక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేరొక గిన్నెలోకి తీసుకుని బాణట్లో వేయాలి. బాగా నానితే అతుక్కోకుండా ఉంటాయి. దంచిన పల్లీలపొడి కూడా చల్లాలి. సగ్గుబియ్యం పారదర్శకంగా అయ్యే దాకా అంటే బాగా ఉడికేదాకా ఉంచి పొయ్యి ఆపేస్తే సరి. దానికి కాస్త ముందు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే పొడిపొడి సాబుదానా కిచిడీ రెడీ!
క్రీమీ ఫ్రూట్ సలాడ్
కావలసిన పదార్థాలు
జీడిపప్పు, కిస్మిస్, బాదం: సన్నగా తరిగిన ముక్కలు (నాలుగు టేబుల్ స్పూన్లు)
విపింగ్ క్రీమ్: చిన్న కప్పు
ఫ్రెష్ క్రీమ్: చిన్న కప్పు
కండెన్స్డ్ మిల్క్: అరకప్పు
దానిమ్మ, ఆపిల్, సపోటా, అరటి, కివీ..: రకరకాల పండ్ల ముక్కలు రెండు కప్పులు
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలోకి విపింగ్ క్రీమ్ తీసుకుని మృదువుగా అయ్యేలా విస్కర్‌తో బీట్చేయాలి లేదా కవ్వంలాంటి వాటితో బాగా చిలకాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి బాగా చిలకాలి. తర్వాత తరిగి పెట్టుకున్న డ్రైఫ్రూట్ ముక్కలు, పండ్ల ముక్కలను వేసి క్రీమ్ అంతా కలిసేలా తిప్పాలి. తర్వాత దాన్ని ఒక గంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. బయటకు తీసి నాలుగు డ్రైఫ్రూట్, పండ్ల ముక్కల్ని అలంకరించి సర్వ్ చేస్తే, ఇక చల్లగా కమ్మగా తినేయడమే!
చిలగడ దుంప టిక్కీ
కావలసిన పదార్థాలు
చిలగడదుంపలు: 4
పచ్చిమిరపకాయలు: 3
అల్లం: అంగుళం ముక్క
కారం: ఒక స్పూను (ఇష్టమైతే)
జీలకర్ర పొడి: అర స్పూను
కార్న్‌ఫ్లోర్: 2 టీస్పూన్లు
బ్లాక్‌సాల్ట్: తగినంత
కొత్తిమీర: కొద్దిగా
నిమ్మకాయ: ఒక ముక్క
తయారీ విధానం
ముందుగా చిలగడదుంపలను ఉడికించి చెక్కుతీసి, ఒక గిన్నెలో వేసి మెత్తగా మెదుపుకోవాలి. అల్లాన్ని తురిమి, కొత్తిమీర, పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి దుంపల ముద్దలో వేయాలి. జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్, బ్లాక్‌సాల్ట్ (లేదా ఉప్పు), కావాలనుకుంటే కారం (ఉపవాస నియమానుసారం) వేసి బాగా కలిపి గట్టి ముద్దలా చేయాలి. తర్వాత చిన్న నిమ్మకాయలంత ఉండలు చేసి అరచేతిలో పెట్టి మందంగా, గుండ్రంగా నొక్కుకోవాలి. అన్నీ అలా నొక్కడం అయ్యాక పొయ్యి మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి రెండు వైపులా ఎర్రగా వచ్చేలా కాల్చుకోవాలి. చివర్లో నిమ్మరసం పిండుకుంటే.. వేడివేడి చిలగడదుంప టిక్కీలు రెడీ!