న్యూఢిల్లీ, డిసెంబర్ 19: తీర ప్రాంతం వెంబడి సముద్రంపై రెస్క్యూ, నిఘాను చేపట్టడంలో ‘వేగవంతమైన పెట్రోలింగ్ నౌక’ (ఎఫ్‌పీవీ)ల పాత్ర అత్యంత కీలకం. ఈ కేటగిరీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఎఫ్‌పీవీ నౌక ‘అమూల్య’ శుక్రవారం గోవాలో జల ప్రవేశం చేసింది. భారత్ నిర్మిస్తున్న ‘ఆదమ్య’ తరహా నౌకల్లో కొత్త తరానికి చెందిన ‘అమూల్య’ను రక్షణ శాఖ అధికారులు జాతికి అంకితం చేశారు.
కోస్ట్‌గార్డ్ అధికారులు దీనిని భారత తూర్పు తీరంలో భద్రతా చర్యల్లో మోహరిస్తారు. తీరం వెంబడి రక్షణ, భద్రతా కార్యకలాపాలు చేపట్టడం, దేశ ప్రయోజనాలను కాపాడటంలో 51మీటర్ల పొడవైన ‘అమూల్య’ కీలకపాత్ర పోషిస్తుందని ఇండియన్ కోస్ట్‌గార్డ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.