హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పంజాబ్‌లో మరో సారి రైతులు రోడ్జెక్కనున్నారు. సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజల పాటు రైల్ రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రుణమాఫీతో పాటు, ఇటీవలి వరదల్లో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ప్రకటించాలని, ఎంఎస్పీకి చట్టబద్ధ హామీ కల్పించాలన్న మూడు ముఖ్యమైన డిమాండ్లతో మళ్లీ 19 రైతు సంఘాలన్నీ ఏకమై ఆందోళనకు రూపమిచ్చాయి.
రెండురోజుల క్రింతం జరిగిన రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ ప్రకటించారు. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లకు చెందిన రైతు సంఘాలు కూడా తమకు మద్దతు ప్రకటించాయని ఆయన తెలిపారు. పంజాబ్‌లోని 12 నగరాల్లో రైల్వే స్టేషన్లలో తాము రైల్‌రోకో చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.