నిజాంపేట్, అక్టోబర్3 : అప్పులు చేసి వరి పంట సాగు చేసిన రైతులను విద్యుత్తు సమస్య వేధిస్తున్నది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల పరిధిలోని మేఘ్యానాయక్తండా, మునిగేపల్లిశివారులో వందలాది ఎకరాల్లో వరిపంట సాగుచేశారు. తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా చేస్తామన్న ప్రభుత్వం లోవోల్టేజీతో ఆరు గంటలు మాత్రమే విడతలవారీగా సరఫరా చేస్తుండటంతో పంట ను కాపాడుకోలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కండ్ల్లముందే ఎండుతున్న పంటలు, ఓ వైపు కాలిపోతున్న మోటర్లను చూస్తున్న రైతన్నల గుండెలు బరువెక్కుతున్నాయి. మరికొందరు జనరేటర్ సహాయంతో వరిపంటను దక్కించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.
రెండు ఎకరాల్లో వరి పంటసాగు చేశా. ఇప్పుడు పొట్ట దశలో ఉన్నది. ప్రభుత్వం కరెంట్ సరిగా సరఫరా చేయడం లేదు. లోవోల్టేజీ సమస్య వల్ల బోరు మోటర్లు నడుస్తలేవు. పంట ఎండిపోయే దశకు రావడం చూసి జనరేటర్ అద్దెకు తీసుకొచ్చా. రోజుకు రూ.3వేల చొప్పున మూడు రోజుల పాటు పొలానికి నీళ్లు పెట్టా. మొత్తం 19 వేల వరకు ఖర్చు అయ్యింది.
– టికారం,రైతు, మేఘ్యనాయక్తండా(సంగారెడ్డి జిల్లా)