న్యూయార్క్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు దక్కే అవకాశం ఉందని ఏపీ వార్తా సంస్థ పలువురు నిపుణుల అంచనాలను వెలువరించింది. ఇతర పోటీదారుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, సూడాన్‌లోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు, ఉక్రెయిన్‌లోని చిన్నారుల హక్కుల కార్యకర్తలు, రెండు అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉన్నాయి. ఈనెల 9న ఓస్లోలో నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారిక ప్రకటన చేయనున్న నేపథ్యంలో ఈ ఏడాది విజేత ఎవరనే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ ఏడాది బహుమతి కోసం కమిటీకి 287 నామినేషన్లు అందగా, అందులో నాలుగో వంతు కంటే కాస్త ఎక్కువగా పలు సంస్థలు ఉన్నాయి. శాశ్వత శాంతి, అంతర్జాతీయ సహకారం.. ఈ లక్ష్యాలకు తోడ్పడే సంస్థల పనితీరును కమిటీ సాధారణంగా పరిగణలోకి తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. నోబెల్ పోటీదారులను అంచనా వేసే నిపుణులలో ఒకరైన పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ‘ఓస్లో’ డైరెక్టర్ హాకెన్ గెర్లోవ్.. ఐఎస్ఎస్ను ఈ జాబితాలో చేర్చారు. మరోవైపు తాను నోబెల్ శాంతి బహుమతిని గెలవాలని బహిరంగంగానే కోరుకుంటున్న ట్రంప్ మరోసారి నామినేట్ అయ్యారు.
అయితే గత ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన నామినేషన్ వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది. 2025 శాంతి బహుమతి గ్రహీత, వెనెజువెలాకు చెందిన మారియా కొరినా మచాడో తన అవార్డును ట్రంప్‌కు బహూకరించడంతో ఈసారి ఎంపిక ప్రక్రియ క్లిష్టంగా మారిందని గెర్లోవ్ పేర్కొన్నారు.