యాచారం, అక్టోబర్ 3: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం ఇటీవల చేపట్టిన అసైన్డ్ భూముల సర్వేలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రైతులు శనివారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామంలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకోసం 19, 68, 127 సర్వే నంబర్లో 677 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు గ్రామంలో ఇటీవలే సర్వే పూర్తి చేసినట్టు రైతులు తెలిపారు.
జీపీవో, సర్వేయర్‌తో పాటు కొంత మంది రెవెన్యూ అధికారులు కుమ్మక్కై సర్వేను తప్పుల తడకగా నిర్వహించారని తహసీల్దార్ అయ్యప్ప, ఉపతహసీల్దార్ కీర్తిసాగర్పై మండిపడ్డారు. నష్టపరిహారం కోసం విడుదల చేసిన జాబితాలో గుంట భూమిలేని వారికి ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఐదెకరాల భూమి ఉన్నవారికి ఎకరానే వచ్చిందని.. మిగతా నాలుగు ఎకరాలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు.
అక్రమాలకు పాల్పడిన జీపీవో, సర్వేయర్‌ను వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, తహసీల్దార్, ఉపతహసీల్దార్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. మండల పరిషత్ కార్యాయలం ఎదుట నాగార్జునసాగర్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై రెండు గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ కేపీవీ రాజు చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యను డీసీపీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.