కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామం ఇది. ఈ గ్రామంలో 750 మందికి పైగా రైతులుండగా 3,900 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. గ్రామానికి నలువైపులా ఆరు చెరువులు, కుంటలున్నాయి. ఎస్సారెస్పీ ఉపకాలువ ఈ గ్రామానికి జీవనాధారం. గతంలో నూటికి నూరు శాతం భూములు సాగయ్యేది.
ఇంచు జాగ కూడా ఖాళీ లేకుండా భూమికి పచ్చని రంగేసినట్టు కనిపించేది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో సీన్ మారింది. కాంగ్రెస్ తెచ్చిన సాగు సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఈ ఒక్క ఊరి రైతులే ఒకే ఒక్క నెలలో సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇది సిర్సపల్లి కన్నీటిగాథ మాత్రమే కాదు. ప్రాజెక్టుల నీటిని నమ్ముకొని సాగుచేసిన ప్రతి గ్రామం గాథ ఇంచుమించు ఇదే మాదిరిగా ఉన్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) హుజూరాబాద్: ఎల్ నినో ప్రభావం ఉన్నదని ఈ వానకాలంలో సిర్సపల్లి గ్రామ రైతులు 70 శాతం భూములనే సాగుచేశారు. ముందో, వెనుకో ఎస్సారెస్పీ కాలువ నీళ్లొస్తయని ఆశపడ్డారు. కానీ, ఎస్సారెస్పీ కాలువ ద్వా రా నీళ్లు రాకపోవడం, ఊరి చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు అడుగంటిపోయిన ఫలితంగా సాగుచేసిన పంటలు వాడుముఖం పట్టాయి. వాటిని కాపాడుకునేందుకు ఏకంగా ఆ ఊరి రైతులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు.
ఇప్పటికే సుమారు 30 శాతం మంది రైతులు కొత్తగా బోర్లు వేశారు. అడుగంటిన భూగర్భజలాల కోసం బావులు తవ్వుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొంత మంది రైతులు ఏకంగా హిటాచీ(ప్రోక్లెయిన్)తో కొత్త బావులు తవ్వుతున్నారు. సుమారు గడిచిన 30 రోజుల్లో రూ.3 కోట్ల వరకు ఈ గ్రామ రైతులు ఖర్చు చేశారు. వ్యవసాయ సంక్షోభం ఉన్నదని చెప్పడానికి ఈ గ్రామమే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే.. ప్రతి ఇంచు భూమిలో సాగైన పంటలు కాపాడే అవకాశం ఉన్నది. అయినా కాంగ్రెస్ సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పుడు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నది.
ఒకప్పుడు ఎస్సారెస్పీ ఉపకాలువ నీటితో కళకళలాడిన సిర్సపల్లి గ్రామం.. ఇప్పుడు చుక్కనీటి కోసం రైతులు బావులు, బోర్లు తవ్వుకునే దుస్థితికి చేరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈ గ్రామంలో ఎటుచూసినా బావులపై క్రేన్ల లొల్లి, కంప్రెషర్ శబ్దాలు, కొత్తగా బావి తవ్వే హిటాచీ(పొక్లెయిన్)ల మోతల రొదలే వినిపిస్తున్నాయి. ఓ ఐదుగురు రైతులు ఒక్కొక్కరు రూ.10 లక్షలు వెచ్చించి యంత్రాలతో ఉమ్మడిగా బావులు తవ్విస్తున్నారు. గడిచిన 30 రోజుల్లో ఈ ఒక్క గ్రామంలోనే ఇప్పటివరకు బోర్లు, బావుల కోసం దాదాపు రూ.3 కోట్ల వరకు ఖర్చు చేయడం..
గ్రామీణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న నీటి సంక్షోభానికి అద్దం పడుతున్నది. నిజానికి హుజూరాబాద్ మండలం దాదాపు 100 శాతం సాగు ఎస్సారెస్పీ నీటిపై అధారపడి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కష్టాలు ఈదిన ఈ గ్రామ రైతులు.. బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కాలువ నీటితోనే రెండు పంటల చొప్పున పండించారు. ఈ గ్రామానికి నలువైపులా రాజన్న చెరువుతోపాటు గాండ్లకుంట, లంబాడి కుంట, ముసలమ్మకుంట, ఊరకుంట, తూముకుంటలు ఉన్నాయి. ఉపకాలువ నీటితో ఈ చెరువులు, కుంటలు గతంలో కళకళలాడేవి. సాగునీటి రంగానికి ఇబ్బందులు ఉండేవి కాదు. ఒకవేళ ఏదేని పరిస్థితిలో వారబందీ పద్ధతిలో సాగునీరిచ్చినా బావులు, చెరువుల్లో ఉండే నీటితో పారుకం జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

కాంగ్రెస్ నిర్లక్ష్యంతో సాగునీరు రాక సిర్సపల్లిలోని రాజన్న చెరువుతోపాటు ఇతర కుంటల్లో జలాలు అడుగంటిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలతోనూ వరదనీరు చేరలేదు. సర్కార్ స్పందించి ఇప్పటికైనా సాగునీటిని విడుదల చేయకపోతే మరో పక్షం రోజుల్లో 60 శాతం పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. ఎస్సారెస్పీని నమ్ముకున్న వందలాది గ్రామాల పరిస్థితి కూడా ఇదే. ఎస్సారెస్పీ స్టేజీ-1, 2 కింద 14 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేయడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
సాధారణంగా వానకాలంలో జూన్ చివరివారం లేదా జూలై మొదటివారంలో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు నాట్లు వేస్తారు. అప్పటివరకు బావులు, చెరువులు, కుంటల్లో ఉండే నీటిని ఆధారంగా చేసుకుని సాగు పనులు షురూ చేస్తారు. జూలై చివరివారం లేదా ఆగస్టు మొదటి వారం నుంచి ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని ఇవ్వడం అనవాయితీగా వస్తున్నది. కానీ, కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఈసారి పూర్తిగా చేతులెత్తేయడంతో లక్షలాది మంది ఆయకట్టు రైతుల పంటల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ఈ వానకాలంలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ పరిధిలో ప్రతి ఇంచు భూమికి సాగునీరు అందించే అవకాశం ఉన్నది. కానీ, కాళేశ్వరంపై కుంటిసాకులు చెప్తూ.. కేవలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలంటూ నీటిని ఎత్తిపోస్తున్నారు. రైతులకు సాగునీరు ఇవ్వాలన్న ఆలోచన మాత్రం పాలకులు చేయడమే లేదు.
ఇటీవల మేడిగడ్డ నుంచి లెక్కకు మించి వరదనీరు గోదావరిలో వెళ్లి సముద్రం పాలైంది. శనివారం (ఈ నెల 26న) 70 వేల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహించింది. ఈ నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. తాజా గణాంకాలు ప్రకారం.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 20.1198 టీఎంసీలు కాగా, పూర్తిసామర్థ్యం ఉన్నది. ఎస్సారెస్పీ ప్రాజెక్టులో చూస్తే ప్రస్తుతం 46 టీఎంసీలు ఉన్నాయి. మధ్యమానేరు సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 24.614 ఉన్నది. లోయర్‌మానేరు డ్యామ్ సామర్థ్యం 24.34 కాగా ప్రస్తుతం 12.539 మాత్రమే ఉన్నది. తాజా పరిస్థితులను చూసినా.. సాగునీటి రంగానికి నీటిని వదిలే అవకాశం ఉన్నది. కనీసం వారబందీ పద్ధతిలో నీటిని వదిలితే పంటలను కాపాడుకునే అవకాశం ఉండటమే కాకుండా ఆయకట్టు పరిధిలో భూగర్భజలాలు పెరిగి, అన్నదాతలు బావులు, బోర్ల ఖర్చుల అదనపు భారం తగ్గుతుంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే వచ్చే యాసంగి పరిస్థితి ఏందో అన్న ఆందోళన రైతుల్లో నెలకొన్నది.
దిగువమానేరు (ఎల్ఎండీ) జలాశయం దిగువన కాకతీయ కాలువ 35 ఏండ్ల చరిత్రలో రాష్ట్రం ఏర్పడక ముందు ఏనాడూ 4 వేల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేయలేదు. కాలువ కట్టలు తెగిపోతాయని ఇవ్వలేకపోయారు. కానీ, బీఆర్ఎస్ సర్కార్ వచ్చాక 6,100 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేసి రికార్డు సృష్టించారు. 1985లో దిగువమానేరు జలాశయం ప్రారంభం కాగా, అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేవరకు ఏ యాసంగి లోనూ 52 టీఎంసీల నీటిని దిగువకు వదలలేదు. కానీ, కేసీఆర్ హయాంలో 52 టీఎంసీల నీటిని దిగువకు పంపి రికార్డు నెలకొల్పారు. రెండు నెలలపాటు ఎల్ఎండీ దిగువన ఉన్న కాకతీయ కాలువకు నీటిని ఆపకుండా సమైక్య సర్కార్‌లో ఏనాడూ నీటిని విడుదల చేయలేదు.
కానీ, కేసీఆర్ సర్కార్ హయాంలో 146 రోజులపాటు నీటిని నిరంతరంగా విడుదలచేసి మరో రికార్డు సృష్టించారు. ఎస్సారెస్పీ స్టేజీ-2 అంటే 284 కిలోమీటర్ నుంచి 348 కిలోమీటర్ వరకు 767 చెరువులను నింపిన ఘనత బీఆర్ఎస్ సర్కార్కే దక్కింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు చరిత్రలో బీఆర్ఎస్ మాత్రమే చెరువులను నింపి రికార్డు సాధించింది. ఎస్పారెస్పీ చరిత్రలో స్టేజీ-2 పరిధిలోని ఆయకట్టుకు సమైక్య సర్కార్‌లో ఒకటి, రెండు టీంఎసీలు కూడా వెళ్లలేదు. కానీ, బీఆర్ఎస్ సర్కార్ పాలనలో 24 టీఎంసీలను స్టేజీ-2 వరకు తీసుకెళ్లింది. ఎస్సారెస్పీ స్టేజీ-1 కింద రెండు సీజన్లలో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరిచ్చిన ఘతన కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది.
ఇతని పేరు తూముల వెంకట్రావు. సిర్సపల్లికి చెందిన ఇతను దుగ్యాల రామారావు వద్ద ఐదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. గతంలో మాదిరిగానే కాకతీయ కాలువ నీళ్లు వస్తాయనే ఆశతో మొత్తం వరి సాగుచేశాడు. వ్యవసాయ బావి ఉన్నా ప్రస్తుతం అడుగంటి పోయింది. వర్షం లేక, కాకతీయ కాలువ నీళ్లు రాక బావిని మరింత లోతు తవ్వుతున్నారు. ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చు పెట్టగా మోటర్ పెడితే పావు గంట కూడా నీళ్లు పోయడంలేదు. ఇదంతా కౌలు గాక అదనపు పెట్టుబడి. సొంత భూమి 10 ఎకరాలు ఉండగా, మొత్తం నాటువేశాడు. ఇప్పటికైనా సాగునీరు ఇవ్వకపోతే కౌలుకు తీసుకున్న పొలంతో పాటు, సొంత పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని రైతు అవేదన చెందుతున్నాడు.
నాకు మూడెకరాల సాగుభూమి ఉన్నది. వరి సాగుచేసిన. కండ్లముందే ఎండిపోతున్న పంటను కాపాడుకొనేందుకు బావిలో పూడిక కోసం రూ.1.5 లక్షలు ఖర్చు పెట్టిన. అయినా నీళ్లు సరిపోతలేవు. ఇప్పటికైనా సర్కార్ కాలువల్ల నీటిని విడుదల చేసి చెరువులు నింపాలి. లేకుంటే పెట్టుబడులన్నీ బూడిదలో పోసినట్టవుతుంది. – రాజిరెడ్డి
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువు. పంతాలకు పోయి కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకనే నీళ్ల కోసం మేమంతా తండ్లాడాల్సి వస్తున్నది. నేను 18 ఎకరాలు వరిసాగు చేసిన. పంటను కాపాడుకునేందుకు వ్యవసాయ బావి పూడిక కోసం రూ.1.7 లక్షలు ఖర్చు పెట్టా. అయినా వచ్చే నీళ్లు సరిపోవడం లేదు. ఎప్పటిలెక్కనే సర్కార్ జెర వెనుకాముందో సాగునీరు ఇస్తుందని అనుకున్నం. కానీ, ఇప్పుడు జూస్తే ఇవ్వడమే లేదు. పెట్టుబడులన్నీ పోతే మా పరిస్థితి ఏందో ప్రభుత్వం ఆలోచించాలి.
– తూముల రవీందర్రావు
నాకు నాలుగెకరాల సాగు భూమి ఉన్నది. మొత్తం వరిపంట సాగుచేశా. బావి ఉన్నా అంతంత మాత్రమే నీళ్లు ఊరుతున్నయి. ఎండిపోయే దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రెండు బోర్లు వేసిన. కానీ చుక్క నీరు పడలే. రూ.2 లక్షలు ఖర్చు పెట్టినా ఫాయిదా లేకుండా పోయింది. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కనికరించి కాలువలకు నీళ్లు వదిలిపెడితే పంటలు పండుతాయి. లేకుంటే పోవడం ఖాయం.
– చెల్పూరి ముత్తయ్య