రాయపోల్ అక్టోబర్ అక్టోబర్ 7: వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. విద్యుత్ కోతలను నిరసిస్తూ సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం చేగుంట–గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. గుర్రాల సోఫా, వీరనగర్ చౌరస్తాల వద్ద రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ నినాదాలు చేశారు. అలాగే
విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నీరు అందించేందుకు విద్యుత్ కోసం ఎదురు చూడాల్సి వస్తోందని, గంటల తరబడి కోతలు విధిస్తుండటంతో సాగు తీవ్రంగా దెబ్బతింటోందని పేర్కొన్నారు. చేతికొచ్చిన పంటలు విద్యుత్ సరఫరా లేక నష్టపోయే పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించే వరకు కదిలేది లేదని స్పష్టం వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. రైతుల రాస్తారోకోతో చేగుంట–గజ్వేల్ ప్రధాన రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు కొంతసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే విద్యుత్ సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు.
ఏడీఈ హామీతో ఆందోళన విరమణ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏడీఈ మధుసూదన్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో నెలకొన్న సమస్యలను పరిశీలించి వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారి హామీతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం రాస్తారోకోను విరమించడంతో రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలు క్రమంగా పునరుద్ధరించబడ్డాయి. కార్యక్రమంలో వీర నగర్. రామారం. వడ్డేపల్లి. సయ్యద్ నగర్. దొడ్లపల్లి. వీరారెడ్డిపల్లి ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు