రాయపొల్ : వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా వివిధ ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు ( ICAR scientists ) సిద్దిపేట జిల్లాలోని రాయపోల్ తిమ్మకపల్లి గ్రామాల్లో శనివారం పర్యటించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వానకాలం సమాయత్తం , విత్తన కొనుగోలులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రతలు తదితర వాటిపై వివరించారు.
విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రైతు కచ్ఛితంగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. నేల ఆరోగ్యం, మట్టి నమూనా సేకరణ , మట్టి పరీక్షల వల్ల కలిగే లాభాలను వివరించారు. వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, పంటల అధిక దిగుబడినిచ్చే రకాలను సూచించారు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు ( Crop Management ), సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో రైతులకు ఎన్నో లాభాలుంటాయని పేర్కొన్నారు.
ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల పై అవగాహన నిర్వహించారు. పీఎం కిసాన్ యాప్ ద్వారా వాతావరణ సూచనలను పొందవచ్చని శాస్త్రవేత్తలు, వరి, పత్తి , మొక్కజొన్నలు వాడే వివిధ యంత్రాలను, డ్రోన్ల ఉపయోగం వలన కలిగే లాభాలను వివరించారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం తునికి శాస్త్రవేత్త డాక్టర్ రవి, సీఆర్ఐడీఏ శాస్త్రవేత్త డాక్టర్ శరత్ చంద్రన్, డాక్టర్ పీసీ మీనా, మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, ఏఈవో రజిత, రైతులు పాల్గొన్నారు.