బోథ్ : రైతు పండించిన ప్రతి పంటకు బోనస్ ( Bonus ) ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ( MLA Anil Jadhav ) డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజల ప్రధాన పంటలైన పత్తి,సోయా,మొక్క జొన్న, శనగ,వేరు శనగ పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. ఆదివారం బోథ్ మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. మొక్క జొన్నతో పాటు సోయాబిన్ , పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరారు. కిషన్ కపాస్ యాప్ ద్వారా రైతులకు అనేక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. యాప్ను ఇప్పుడే అమలు చేయకుండా క్రమ క్రమంగా మొదలు పెట్టాలని సూచించారు. అనేక మంది రైతుల వద్ద సెల్ఫోన్లు లేవని, ఉన్న నెట్వర్క్ ఉండదని పేర్కొన్నారు.
ఒకటి, రెండు సంవత్సరాలు పాత పద్ధతి ద్వారానే పత్తి కొనుగోలు చేయాలని తెలిపారు. రైతులు ఎవరుకూడా దళారులకు పంట అమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.