న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఉద్యమం ఇంకా ముగిసిపోలేదని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. ఈ నెల 29న 30 ట్రాక్టర్లలో 500 మంది రైతులు ఢిల్లీకి ర్యాలీగా చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ నెల 27న రైతు సంఘాల నేతలతో జరిగే భేటీలో భవిష్యత్తు కార్యాచరణతో పాటు ట్రాక్టర్ ర్యాలీపై మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. జనవరి 1 నుంచి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ అన్నారని, ఎంఎస్పీకి చట్టబద్ధత లేకుండా ఆదాయం రెట్టింపు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పంటకు సరైన ధర లభించినప్పుడే అన్నదాతలు విజయం సాధించినట్టు అని వెల్లడించారు.