మోర్తాడ్, మే 7: దొడ్డు వడ్లు కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ రైతులు కమ్మర్‌పల్లిలోని భీమ్‌గల్ చౌరస్తా వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. పదిరోజులు గడుస్తున్నా ధాన్యం కాంటా చేయడంలేదని, కాంటా చేసినా రైస్ మిల్లులకు తరలించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యాన్ని లారీలో లోడ్ చేయడానికి బస్తాకు అదనంగా రెండు నుంచి మూడు రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు.
ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, రాస్తారోకో విరమించాలని స్థానిక ఎస్సై అనిల్‌రెడ్డి రైతులను వారించే ప్రయత్నం చేశారు. మోర్తాడ్ తహసీల్దార్ కృష్ణ అక్కడికి చేరుకొని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పినా రైతులు ససేమిరా అన్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైతులు రోడ్లపైకి వస్తేనే అధికారులు వస్తారా, ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఎలా ఉన్నది, కాంటా చేస్తున్నారా లేదా అనేది పట్టించుకోరా అని రైతులు ప్రశ్నించారు. సివిల్ సప్లయ్ డీఎంతో తహసీల్దార్ రైతులతో మాట్లాడించి, సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
కమ్మర్‌పల్లిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
రోడ్డుపైన బైఠాయించిన రైతులు తహసీల్ ఆఫీస్‌కు వెళ్లి తహసీల్దార్‌తో సమావేశమయ్యారు. కమ్మర్‌పల్లిలో సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్షం కురిస్తే ధాన్యం తడిస్తే తాము నష్టపోతామని, వారం పది రోజులు గడుస్తున్నా వడ్లు కాంటా చేయడంలేదని వాపోయారు. లారీలు సమయానికి వచ్చేలా చూస్తానని, శుక్రవారం నుంచి వడ్ల తరలింపునకు చర్యలు చేపడుతామని తహసీల్దార్ రైతులకు భరోసా ఇచ్చారు.
ఆందోళన కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, మాజీ సర్పంచ్ గడ్డంస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్యాల సుభాష్‌గౌడ్, రైతులు రెంజర్ల గంగాధర్, కొమ్ముల శ్రీనివాస్, కిషన్, గణేశ్, రాజేశ్వర్, గంగాధర్, అరుణ్‌రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాస్తారోకో నిర్వహిస్తున్న సమయంలో బస్సులో నుంచి ఓ ప్రయాణికుడు రైతుల వద్దకు వచ్చాడు. తాను పరీక్షకు వెళ్తున్నానని బస్సును వెళ్లనివ్వాలని కోరడంతో రైతులు రెండు బస్సులను వెళ్లనిచ్చి, మళ్లీ రాస్తారోకో చేపట్టారు.