సూర్యాపేట జిల్లా చివ్వెంల.. ఐకేపీ కేంద్రం దగ్గర 3 గంటలపాటు నిరీక్షణ.. పోలీసుల సాయంతో ప్రవేశం.. మూడు నిమిషాల ముచ్చట.. పొలోమని పరుగు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్), కందగట్ల.. ఐకేపీ కేంద్రం దగ్గర 4 గంటలకు పైగా నిరీక్షణ.. లోపలికి వెళ్లకుండానే వెనక్కిసూర్యాపేట జిల్లా వట్టిఖమ్మం పహాడ్.. ఆగడమే కష్టమైంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం.. రోడ్డుపై పరిస్థితి చూసి ఆగకుండానే ముందుకు.. జనగామ.. నిరసనల గురించి తెలుసుకొని.. నేరుగా హైదరాబాద్‌కు
అన్నదాత ఆగ్రహానికి గురైతే ఏం జరుగుతుందో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి అనుభవంలోకి వచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన పేరుతో మందీమార్బలాన్ని వెంటేసుకొని సోమవారం నల్లగొండ జిల్లాలో బండి మూక సృష్టించిన అరాచకాన్ని చూసిన రైతులు మంగళవారం సూర్యాపేటలో అడుగడుగునా సంజయ్‌ని ఉరికించారు.
నల్లజెండాలు, ప్లకార్డులతో ఎక్కడికక్కడ అడ్డుకొన్నారు. దీంతో.. గంటల తరబడి నిరీక్షించినా.. కొనుగోలు కేంద్రాల్లోకి అడుగు పెట్టలేక.. ఎక్కడికక్కడ రూట్లు మార్చుకొని.. రైతుల కంటపడకుండా.. వెళ్లిపోవాల్సివచ్చింది. తీవ్ర అసహనంతో బీజేపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో రైతులపై, టీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేశాయి. బీజేపీ తీరుపై రైతులు శాంతించకపోవడంతో బండి.. యాత్ర మధ్యలోనే హైదరాబాద్‌కు తిరిగి పోవాల్సివచ్చింది.
సూర్యాపేట/జనగామ, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తొండియాత్ర.. సూర్యాపేట జిల్లాలో మంగళవారం తోకముడిచింది. రైతుల ఆగ్రహానికి కొనుగోలు కేంద్రాల్లో అడుగు పెట్టలేక గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. పోలీసుల సాయంతో ఒకట్రెండు కేంద్రాల్లోకి ప్రవేశించగలిగినా రెండు మూడు నిమిషాలు మించి ఉండలేక వెనక్కి మళ్లాల్సి వచ్చింది.
పలుచోట్ల రూట్లు మార్చుకొని ఇతర మార్గాల్లో వెళ్లక తప్పలేదు. పలుచోట్ల సంజయ్ వెంట వందలకొద్దీ వాహనాల్లో వచ్చిన బీజేపీ కార్యకర్తలు.. అసహనానికి గురై బీభత్సం సృష్టించారు. యాసంగి పంటలు కొంటారా? కొనరా? అన్న రైతుల ప్రశ్నలకు సూటి గా జవాబివ్వకుండా ముక్తసరిగా మూడు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోవడంతో బండి రాజకీయ డ్రామా బట్టబయలైంది.
సోమవారం నల్లగొండ జిల్లాలో బీజే పీ అరాచకాన్ని చూసిన రైతాంగం.. మంగళవారం సూర్యాపేట జిల్లాలో అప్రమత్తమైంది. తిరుమలగిరి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో సంజయ్ యాత్రను అడుగడుగునా అడ్డుకొన్నారు. బీజేపీ గ్యాం గ్ను కొనుగోలు కేంద్రాల్లోకి అడుగు పెట్టనివ్వలేదు. సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
నిరసనలను తట్టుకోలేని బీజేపీ శ్రేణులు ఉక్రోషంతో రైతులపై దాడికి తెగబడ్డాయి. బీజేపీ నేతలు చివ్వెంల మండలంలోని వట్టిఖమ్మంపహాడ్, ఆత్మకూర్.ఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద అలజడి రేపారు. ఇతర ప్రాంతాల నుంచి వందల వాహనాల్లో వచ్చిన బీజేపీ శ్రేణులు వెదురు కర్రలు, రాళ్లతో వీరంగం వేశారు. రైతులపైకి చెప్పులు విసిరారు. చివ్వెంలలో కానిస్టేబుల్, ఆత్మకూర్.ఎస్ మం డలంలో రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు.
సోమవారం మాదిరిగా ధాన్యం కుప్పలపైకి వస్తే ఆగమాగం చేస్తారన్న ఆందోళనతో మహిళారైతులు కుప్పలకు రక్షణ గోడగా నిలిచి కాపాడుకోవాల్సి వచ్చింది. మహిళారైతులు ప్లకార్డులు పట్టుకొని సంజయ్‌ని తీవ్రంగా నిరసించారు. దీంతో ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోకి కూడా సంజయ్ వెళ్లలేక పోయారు. ఒకటిరెండుచోట్ల మాత్రం గంటల తరబడి నిరీక్షించి.. పోలీసు వల యం మధ్య కేంద్రంలోకి చొరబడి.. ఒకటిరెండు నిమిషాల్లో బయటికి వచ్చేశారు.
ఈ తంతు చూసి బీజేపీ శ్రేణులే ఇదేం యాత్రరా బాబూ అని తలపట్టుకొన్నా రు. భూస్వామ్య దాడులను మరిపించే పద్ధతిలో సంజ య్ వెంట వచ్చిన గూండాల అరాచకాన్ని తిప్పి కొట్టి న ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి మంత్రి జగదీశ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సూర్యాపేట చైతన్యాన్ని మరోమారు చాటిన మహిళా రైతాంగాన్ని అభినందించారు.
వానకాలం కొనుగోళ్ల ప్రక్రియలో లేని సమస్యను సృష్టించి.. ఏదో ఒరగబెట్టినట్టు బయలుదేరిన సంజయ్‌కు నిరసనలు పెల్లుబుకడంతో రూట్లు మార్చుకోవాల్సి వచ్చింది. షెడ్యూలులో లేని ఊళ్లకు వెళ్లి.. రోడ్ల పక్కన ఎండబోసిన ధాన్యం కుప్పల దగ్గర ఒకటిరెండు నిమిషాలు ఆగి.. మీడియాకు పోజులిచ్చి వెళ్లిపోయారు. నిజానికి రెండోరోజు యాత్రలో భాగంగా సంజయ్ మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంతోపాటు ఇదే మండలం వట్టి ఖమ్మంపహాడ్, ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రం, కందగట్ల మీదుగా కుడకుడకు చేరుకొని అక్కడి నుంచి గాంధీనగర్ మీదుగా జాజిరెడ్డిగూడెం వెళ్లాలి.
కానీ, రైతుల నిరసనతో చివ్వెంలలో 3 గంటలు నిరీక్షించి 3 నిమిషాల్లో ప్రసంగం ముగించిన సంజయ్.. వట్టిఖమ్మంపహాడ్లో ఆగడమే కష్టమైంది. దీంతో కొంతదూరం వెళ్లిన తర్వాత లక్ష్మితండా వద్ద రోడ్డు పక్కన రైతులు ఆరబోసుకున్న ధాన్యం కుప్పదగ్గర ఆగి ఫొటోలు దిగారు. అనంతరం ఆత్మకూర్.ఎస్‌లో రైతుల ధాటికి ఆగలేకపోయారు. కందగట్లలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఈ రెండు చోట్ల దాదాపు 4 గంటలపాటు నిరీక్షించి వెళ్లిపోయారు. మిగతా పర్యటనలన్నీ రద్దుచేసుకొని జాజిరెడ్డిగూడెం వెళ్తే అక్కడ నిరసనల దెబ్బకు నేరుగా తిరుమలగిరికి చేరుకున్నారు.
జనగామ జిల్లాలో అడుగు పెట్టకముందే రైతులు, మహిళల నుంచి పెద్దఎత్తున నిరసన సెగ తగలడంతో సంజయ్ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని హైదరాబాద్‌కు తోకముడిచారు. జనగామ జిల్లా రైతు లు, ప్రజలు, మహిళలు ఉదయం నుంచి రోడ్డెక్కి కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక నల్లచట్టాలు, యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బండిని నిలదీసేందుకు నల్లజెండాలతో ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొడకం డ్ల మండలం మొండ్రాయి, దేవరుప్పుల మండలం మన్‌పహాడ్, దేవరుప్పుల, ధరావత్‌తండా, సింగరాజుపల్లి, లింగాలఘనపురం మండలం వనపర్తిలో వందల మంది రైతులు, మహిళలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
వారికి టీఆర్ఎస్ శ్రేణులు మద్దతు పలకడంతో సూర్యాపేట హైవేలో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. దేవరుప్పుల మండలం మన్‌పహాడ్, దేవరుప్పుల, ధరావత్‌తండా, సింగరాజుపల్లి ఐకేపీ కేంద్రాలను బండి పరిశీలించాల్సి ఉన్నా.. రైతు ల నిరసనల సెగతో రూటు మార్చుకొని ఇంటిదారి పట్టారు. మంగళవారం రాత్రి జనగామలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసుకున్న బీజేపీ రాష్ట్ర పదాధికారుల అత్యవసర సమావేశం సైతం రద్దయింది.
సంజయ్ తన మైలేజీ పెంచుకోవడానికే యాత్ర చేస్తుండు. రైతులపై ప్రేమ ఉంటే వచ్చే యాసంగి వడ్లను కేంద్రమే కొంటదని ప్రధానితో ప్రకటన చేయించాలి. తెలంగాణలో రైతులంతా యాసంగిలో దొడ్డురకం ధాన్యమే పండిస్తారని సంజయ్‌కి తెల్వదా?-ఓర్సు వెంకన్న, రైతు, రామన్నగూడెం,
అర్వపల్లి మండలం
రాష్ట్ర ప్రభుత్వం వానకాలం వడ్లు కొంటున్నది కదా, బీజేపోళ్లకు ఇక్కడేం పని? మమ్మల్ని రెచ్చగొట్టేలా మాట్లాడి మాపై రాళ్లు విసిరి పోయారు. బండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు చూడటానికి రాలేదు. రౌడీలతో దాడి చేయడానికి వచ్చిండు.-యాతాకుల లింగయ్య, రైతు, ఆత్మకూర్.ఎస్, సూర్యాపేట జిల్లా
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అనుమతి తీసుకోకుండా పర్యటించి శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన బండి సంజయ్‌పై కేసు నమోదుచేసినట్లు ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఆయనతో పాటు కొన్నిచోట్ల బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలపైనా కేసులు బుక్చేసినట్లువివరించారు.
సూర్యాపేట జిల్లాలో మంగళవారం సంజయ్ పర్యటనలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌పై దాడి జరిగింది. ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో బీజేపీ, రైతుల మధ్య ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు రెండు వర్గాలను చెదరగొడుతున్న సమయంలో బీజేపీ గుంపువైపు ఉన్న శ్రీనివాస్‌ను అదే గుంపులో నుంచి మర్మాయవాలపై తన్నడంతో ఆయన స్పృహతప్పి పడిపోయాడు. హార్ట్ స్ట్రోక్‌గా భావించిన పోలీసులు హుటాహుటిన సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా వైద్యులు హార్ట్ ఎటాక్ కాదని చెప్పారు. మర్మాయవాలపై దెబ్బ తగులడం వల్లనే ఇలా జరిగిందని డాక్టర్ చెప్పినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.