చేగుంట, ఆగస్టు 8 : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ గెస్ట్‌హౌస్ ప్రహరీని రైతులు, స్థానికులు కూల్చివేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం జెప్తిశివునూర్లో శనివారం చోటుచేసుకున్నది. పంట పొలాలకు వెళ్లే రహదారిని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని అంటూ చుట్టుపక్కల రైతులు, గ్రామస్తులు దాన్ని ధ్వంసం చేశారు. తమ పంట పొలాలకు వెళ్లే రహదారిని మూసివేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
ప్రహరీ నిర్మాణం కారణంగా అమ్మకుంట, తాతకుంటతోపాటు జెప్తి శివునూర్ గ్రామానికి చెందిన రైతుల పొలాలకు వెళ్లే మార్గం మూసుకుపోయిందని వారు పేర్కొన్నారు. దారి వదిలి గోడ నిర్మించుకోవాలని తాము ఇదివరకే షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సుమారు 200 వందల ఎకరాల భూములకు సంబంధించిన రైతులు అదే దారి నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రహరీని ధ్వంసం చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని నార్సింగి ఆర్ఐ శ్రీధర్ తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.