ఆదిలాబాద్, డిసెంబర్ 13 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాఫెడ్ కోటా పూర్తయినందున జిల్లాలోని వివిధ మార్కెట్‌యార్డుల్లో వారం రోజుల నుంచి పంట కొనుగోళ్లు జరగడం లేదు. ఈ ఏడాది వానకాలంలో జిల్లాలో 71,226 ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు చేశారు. ఆదిలాబాద్ రూరల్, మావల, జైనథ్, బేల, తాంసి, తలమడుగు మండలాల్లో ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున పంట దిగుబడి వచ్చింది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో అక్టోబర్ మొదటి వారంలో సోయాబీన్ కొనుగోళ్లను ప్రారంభించారు. ఆయా మండలాల ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఆదిలాబాద్, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, బేల, తాంసి, నార్నూర్, జైనథ్, నేరడిగొండ మార్కెట్ యార్డుల్లో పంటను సేకరించారు. ఈ నెల 5 వరకు జిల్లాలో 2.47 లక్షల క్వింటాళ్ల పంటను కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్‌రెడ్డి తెలిపారు.
పంట విక్రయించేందుకు పడిగాపులు
జిల్లాలో వారం రోజులుగా సోయాబీన్ కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు పంట విక్రయించేందుకు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ కోటా ముగిసినందునా పంట కొనుగోళ్ల నిలిచిపోయాయి. అధికారులు అదనంగా పంట కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్‌కు లేఖలు రాసినా ఇంతవరకు అనుమతి లభించలేదు. జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్, తలమడుగు, తాంసి మండలాల్లో రైతుల వద్ద పంట నిల్వలు ఉన్నాయి. బేల మార్కెట్‌యార్డులో రైతులు నాలుగు రోజుల కిందట పంటను తీసుకువచ్చి విక్రయించేందుకు ఎదురుచూస్తున్నారు. పలు గ్రామాల్లో రైతుల ఇండ్లలోనే సోయా నిల్వలు పేరుకుపోయాయి. జిల్లాలో చలి కారణంగా పంటలో తేమ శాతం పెరిగే అవకాశం ఉండడం, చల్లటి వాతావరణం కారణంగా సోయాబీన్ నల్లగా మారి పాడవుతుందని రైతులు అంటున్నారు. మార్కెట్‌యార్డుల్లో ఉంచిన పంటకు రక్షణగా రైతులు రాత్రి, పగలు అక్కడే కాపలా ఉంటున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో ముంచుతో పంట పాడవకుండా టార్పాలిన్ కవర్లు కప్పుతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసి పంట నష్టపోకుండా సోయా కొనుగోళ్లను ప్రారంభించాలని కోరుతున్నారు.
4 రోజుల నుంచి కాపలా ఉంటున్నాను..
నేను 5 ఎకరాల్లో సోయాబిన్ పంటను సాగు చేయగా 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంటను విక్రయించేందుకు బేల మార్కెట్‌యార్డుకు నాలుగు రోజుల కిందట తీసుకువచ్చాను. బార్కోడ్, గన్ని సంచులు లేకపోవడంతో కొనుగోళ్లు జరపడం లేదని మార్కెటింగ్ సిబ్బంది అంటున్నారు. పంట నష్టపోకుండా రాత్రి, పగలు కాపలా ఉంటున్నాం. చలికి గజ గజ వణుకుతూ కాపలా కాస్తున్నాం. ఎప్పుడు కొంటరో అధికారులు చెప్పడం లేదు. ఎవరిని అడుగాలో తెలియడం లేదు. పంట నష్టపోకముందే అధికారులు కొనాలి.
– దీపక్, రైతు, డోప్తాల, బేల మండలం